అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ కేటగిరీలోని అన్ని ఆహారాలను ఒకే విధంగా చూడలేమని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. మొత్తం అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార వినియోగానికి.. పెద్దపేగు క్యాన్సర్ అంటే కొలొరెక్టల్ క్యాన్సర్ ముప్పు మధ్య ఎలాంటి డైరెక్ట్ సంబంధం లేదని ఈ పరిశోధన తేల్చింది. అయితే కొన్ని ఆహార పదార్థాలు మాత్రం భిన్నమైన ఫలితాలను చూపించాయి.
ప్రముఖ సైన్స్ జర్నల్ 'PLOS మెడిసిన్'లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం పరిశోధకులు అమెరికాకు చెందిన 4లక్షల 61వేల682 మంది పెద్దల డేటాను విశ్లేషించారు. 1995-1996 మధ్య కాలంలో ఎంపిక చేసిన ఈ వ్యక్తులను దాదాపు 18.8 సంవత్సరాల పాటు ట్రాక్ చేశారు. ఈ కాలంలో 10వేల 075 మందిలో కొలొరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి. పాల్గొన్న వారి రోజువారీ ఎనర్జీ అవసరాల్లో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటా సగటున 43%గా ఉంది. అయినప్పటికీ వీటిని అత్యధికంగా తిన్నవారికి, తక్కువగా తిన్నవారికి మధ్య క్యాన్సర్ ముప్పులో పెద్దగా ఎలాంటి తేడా కనిపించలేదట.
మొత్తం వినియోగాన్ని పక్కన పెట్టి విడివిడి ఆహార వర్గాలను పరిశీలించినప్పుడు వేర్వేరు ఫలితాలు వెలుగు చూశాయి. అల్ట్రా-ప్రాసెస్డ్ బ్రెడ్, బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ ఎక్కువగా తిన్నవారిలో కొలొరెక్టల్ క్యాన్సర్ ముప్పు క్రమంగా 9% నుంచి 16% వరకు తక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ఫ్రోజెన్ డెజర్ట్స్, మిల్క్ డ్రింక్స్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపించింది. అయితే రీకాన్స్టిట్యూటెడ్ మాంసం, చేపల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకున్నవారిలో మాత్రం క్యాన్సర్ ముప్పు 10% ఎక్కువగా నమోదైనట్లు పరిశోధకులు గుర్తించారు.
బ్రెడ్ లేదా సీరియల్స్ తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుందని, మాంసాహారమే నేరుగా క్యాన్సర్కు కారణమవుతుందని దీని అర్థం కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇది కేవలం అబ్జర్వేటివ్ స్టడీ మాత్రమేనని తేల్చిచెప్పారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల నుంచి వచ్చే పీచు పదార్థాలు, తృణధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తుంటే.. ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులు మాత్రం భిన్నమైన ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ మొత్తాన్ని ఒకే వర్గంగా చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనం ద్వారా స్పష్టమవుతోంది. అయితే తీసుకునే ఆహారంలో ప్రాసెస్ చేయని తాజా పదార్థాలకు పెద్దపీట వేయడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఈ పరిశోధన కేవలం 1990ల నాటి అమెరికన్లపై మాత్రమే జరగడం వల్ల, నేటి ఆధునిక కాలానికి లేదా ఇతర దేశాల ప్రజలకు ఇది ఎంతవరకు వర్తిస్తుందనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
