ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ హైవేపై అండర్ పాస్ వంతెన కూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండల లిగరాజుపల్లి గ్రామం దగ్గర వంతెన కూలటం స్థానికంగా విమర్శలకు దారి తీసింది. లింగరాజు పల్లి గ్రామం దగ్గర నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి అండర్ పాస్ వంతెన పైకప్ప ఒక్కసారిగా కూలిపడింది.
2026 అక్టోబర్ 11న (ఆదివారం) వంతెన కూలగా విషయం బయటకు రాకుండా కాంట్రాక్టర్ దాచిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వంతెన స్లాబ్ కూలటంతో పాటు కాంక్రీట్ గోడలు పక్కకు ఒరిగిపోయాయి.
ఈ విషయం బయటకు రాకుండా గుట్టు చప్పుడు కాకుండా కాంక్రీట్, కడ్డీలను యంత్రాలతో సోమవారం తొలగించారు. వంతెన పునాది కూడా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఎంత పటిష్టంగా ఉండాల్సిన గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన నిర్మాణ దశలోనే కూలిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
కడప-రేణిగుంట జాతీయ రహదారి పనులను 3 వేల 522 కోట్లతో రెండు ప్యాకేజీలుగా ప్రారంభించారు. ఇప్పటికే పనుల్లో నాణ్యత పాటించడం లేదని విమర్శలు వస్తుండగా.. వంతెన కూలడంతో అధికారు పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
