- వివరాలు వెల్లడించిన ఎస్పీ
మంచిర్యాల, వెలుగు : అధిక లాభాలు, చిట్‌ఫండ్స్ ఆశచూపి ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసిన యూనిక్ సంస్థల భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ప్రధాన నిందితుడు యూనిక్ సంస్థల ఎండీ రాజ్‌కుమార్ రాయ్‌ను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు కేస్ వివరాలను వెల్లడించారు.
యూనిక్ మర్చంటైల్ ఇండియా లిమిటెడ్, యూనిక్ ఎస్ఎంసీఎస్ అనే సంస్థల పేరుతో రాజ్‌కుమార్ రాయ్, చంద్రశేఖర్ ఇద్దరు మోసగాళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించారు. నెలవారీ కిస్తీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా డబ్బులు కడితే, మెచ్యూరిటీ తర్వాత అదనపు లాభాలతో పాటు రియల్ఎస్టేట్లో ప్లాట్లు కూడా ఇస్తామని మాయమాటలు చెప్పారు.
గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో 14 కేసులు నమోదు కాగా, ఒక్క ఆదిలాబాద్జిల్లాలోనే సుమారు 2 వేల మంది నుంచి రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధితుల నుంచి దండుకున్న కోట్లాది రూపాయలతో నిందితులు బెంగళూరు, పశ్చిమ బెంగాల్, జైపూర్, మహారాష్ట్రల్లో హోటళ్లు కొనుగోలు చేశారు.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో 400 ప్లాట్లు, బీబీనగర్ ఎయిమ్స్ పరిసరాల్లో సుమారు 200 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై ఆదిలాబాద్ వన్ టౌన్, టూటౌన్, మావల, ఆదిలాబాద్ రూరల్, తలమడుగు పోలీస్స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదు కాగా, తలమడుగు పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం రాత్రి ఆదిలాబాద్ కలెక్టరేట్ చౌక్ వద్ద ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ రాయ్ ను అరెస్ట్ చేశారు.
మరో నిందితుడు యూనిక్ సంస్థల హైదరాబాద్ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడు. రాజ్‌కుమార్‌కు గతంలో మెడికల్ కంపెనీ, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కూడా మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, యూనిక్ సంస్థల చేతిలో మోసపోయిన బాధితులు భయపడకుండా తమ వద్ద ఉన్న రశీదులు, బ్యాంకు లావాదేవీల వివరాలతో స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.
