ఎండలు దంచికొడ్తయ్ జాగ్రత్త!

ఎండలు దంచికొడ్తయ్ జాగ్రత్త!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే టెంపరేచర్లు అసాధారణ స్థాయికి పెరిగాయని, మార్చి ఫస్ట్ వీక్ నుంచే ఎండలు దంచికొడ్తాయని.. వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రజలంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అడ్వైజరీని జారీ చేసింది. రాష్ట్రాలు, యూటీల ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండాలని ఆదేశించింది. మార్చి 1 నుంచి అన్ని జిల్లాల్లో ఎండ వేడిమి సంబంధిత అనారోగ్యాలపై ప్రత్యేకంగా రోజువారీ సర్వీలెన్స్ చర్యలు చేపట్టాలని మంగళవారం ఈ మేరకు కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, యూటీల అడ్మినిస్ట్రేటర్లకు లేఖ రాశారు. కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ప్రోగ్రాం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్  జారీ చేసే హీట్ వేవ్ అలర్ట్ లను బట్టి ఆయా ప్రాంతాల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండ వేడిమి సంబంధిత అనారోగ్యాలు, డెత్స్ వివరాలను మార్చి 1 నుంచి ఎన్ సీడీసీ వెబ్ సైట్​లో అందుబాటులో ఉన్న ఎన్ పీసీసీహెచ్ హెచ్ సెక్షన్ లో అప్డేట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. 

వీరికి రిస్క్ ఎక్కువ 

ఎండలో బయట పనిచేసేవాళ్లకు, గుండెజబ్బు లేదా హైబీపీ ఉన్నవాళ్లకు, గర్భిణీలకు, 65 ఏండ్లు పైబడిన వాళ్లకు, చిన్న పిల్లలు, శిశువులకు ఎండాకాలంలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని, వీరి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అడ్వైజరీలో కేంద్ర  ఆరోగ్య శాఖ హెచ్చరించింది.  

 చేయాల్సినవి.. 

 

  •     తగినన్ని నీళ్లు తాగాలి. నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్ వంటి పండ్లనూ వినియోగించాలి. 
  •     తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే.. క్యాప్, లూజ్​గా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. 
  •     తరచూ సన్ స్క్రీన్ లోషన్లను వినియోగించాలి. 
  •      తరచూ చల్లటి నీటితో స్నానం చేయాలి. 
  •      ఎమర్జెన్సీ మెడికల్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి. 

చేయకూడనివి..

 

  •     వీలైనంత వరకూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో తిరగకూడదు. 
  •     పార్క్ చేసిన వెహికల్స్​లో చిన్న పిల్లలను, వృద్ధులను, పెట్స్ ను వదిలేసి వెళ్లొద్దు. 
  •     ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ డ్రింక్స్ లను  వీలైనంత వరకు తాగొద్దు.
  •     స్పైసీ, ఆయిలీ, నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవద్దు.
  •     తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి.
  •     ఈజీగా అరిగే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి.