హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఇంకా ఆట మొదలుపెట్టలేదని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ముందుంది ముసళ్ల పండుగా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీ సంగతి చెప్తామన్నారు. ఢిల్లీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మాత్రం అర్థరాత్రి వేళల్లో బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ధర్నా చౌక్గా జంతర్ మంతర్ను ఢీనోటిఫై చేసి నిరసనలకు మరో మూడు ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. శుక్రవారం (అక్టోబర్ 16) హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్, సింగరేణి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి తనతో మాట్లాడారని చెప్పారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వచ్చి కలుస్తానని చెప్పారని తెలిపారు. సింగరేణి బొగ్గు సరఫరా తగ్గింది, యాదాద్రి పవర్ ప్లాంట్ పనిచేసే పరిస్థితి లేదని అన్నారు. సింగరేణి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిధులు రూ.25 వేల కోట్లకు పైగా ఉండేవి.. ప్రస్తుతం అప్పు రూ.60 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు.
దేశంలో హైడ్రో పవర్ ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరగడంతో భారం మొత్తం బొగ్గుపై పడిందని తెలిపారు.
తెలంగాణకు కొత్తగా మూడు కోల్ బ్లాకులు ఇచ్చామని చెప్పారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రాలు విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్, నీరు వృథా చేయొద్దని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని అందరూ కలిసి ఎదుర్కోవాలని సూచించారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదని.. ధరల పెరుగుదలకు ప్రపంచవ్యాప్త మార్పులే కారణమని పేర్కొన్నారు.
