బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ప్రారంభానికి ముందే వివాదాలతో హీటెక్కించేస్తోంది. ప్రస్తుతం కామనర్స్ కు అవకాశం కల్పించేందుకు 'అగ్ని పరీక్ష 2' జరుగుతోంది. అయితే ఆడిషన్స్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు వ్యవహారం మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆడిషన్ సమయంలో జడ్జిగా వ్యవహరించిన నటుడు నవదీప్‌కు, ఉప్పల్ బాలుకు మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. బాలు సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్ చేస్తాడంటూ నవదీప్ ప్రశ్నించగా.. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే అలాంటి వీడియోలు చేశానని బాలు సమాధానం ఇచ్చారు. అయితే తన నేపథ్యం తెలిసే ఆడిషన్‌కు పిలిచి అవమానించడం ఎందుకంటూ బాలు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా పలు మీడియా వేదికలపై నవదీప్‌పై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ శాపనార్థాలు కూడా పెట్టారు. దీంతో అటు బాలుకు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్ల మద్దతు కూడా లభించింది.
అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. లేటెస్ట్ గా బాలు మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో జడ్జీల నిర్ణయాన్ని సమర్థించారు. జడ్జీలు చేసింది వంద శాతం న్యాయం. ఆ కుర్చీలో కూర్చోవడం అంత సులభం కాదు. టాలెంట్ ఉంది కాబట్టే వాళ్లు అక్కడ ఉన్నారు అంటూ బాలు ప్రశంసలు కురిపించాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం తన చిన్ననాటి కల అని, అవకాశం రాకపోవడం బాధగా ఉన్నప్పటికీ తన ప్రయాణం ఇక్కడి వరకు రావడం సంతోషంగా ఉందని చెప్పాడు.
ఇదే ఇప్పుడు అసలు ట్విస్ట్‌గా మారింది. నిన్నటి వరకు నవదీప్‌పై తీవ్ర విమర్శలు చేసిన బాలు.. ఇప్పుడు జడ్జీల నిర్ణయం సరైందంటూ మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బాలు అసలు నీ స్ట్రాటజీ ఏంటి?, ఇది నిజమైన యూటర్నా? లేక బిగ్ బాస్ ఎంట్రీ కోసం కొత్త ప్లానా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలు నాగార్జునతో పాటు స్టార్ మా యాజమాన్యానికి బిగ్ బాస్ హౌస్‌లోకి తనను తీసుకోవాలని బహిరంగంగా విజ్ఞప్తి చేయడం కూడా మరింత ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు జడ్జీలను సపోర్ట్ చేయడం వెనుక ఏదో 'బిగ్ బాస్ స్ట్రాటజీ' ఉందనే ప్రచారం కూడా ఊపందుకుంది. సెప్టెంబర్ తొలి వారంలో సీజన్ 10 ప్రారంభం కానున్న నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసమే బాలు ఈ డ్రామా ఆడుతున్నారా లేక నిజంగానే తగ్గారా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు యూటర్న్ పై పెద్ద డిస్కషన్ నడుస్తోంది.
