భారత్‌లో టాలెంట్‌కు విలువ లేదా? ఇన్వెస్టర్లు లేక బిజినెస్ అమ్మేసుకుని అమెరికా వెళ్లిన స్టార్టప్ ఓనర్

భారత్‌లో టాలెంట్‌కు విలువ లేదా? ఇన్వెస్టర్లు లేక బిజినెస్ అమ్మేసుకుని అమెరికా వెళ్లిన స్టార్టప్ ఓనర్

భారతదేశాన్ని గ్లోబల్ సూపర్‌పవర్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం, యువత ఎంతగా కలలు కంటున్నా.. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే వారికి మన దేశంలో ప్రోత్సాహం లభించడం లేదని నిరూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. డీప్-టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా 'బయోకంప్యూట్' అనే స్టార్టప్‌ను ప్రారంభించిన 24 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అనఘా రాజేష్ అనుభవం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. డిజిటల్ డేటాను DNAలో స్టోర్ చేసే అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఏకంగా రూ.5 కోట్లు వెచ్చించారు. అయితే మరింతగా దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ లభించకపోవటంతో కంపెనీని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అనఘా రాజేష్ రూపొందించిన డీఎన్‌ఏ డేటా స్టోరేజ్ టెక్నాలజీ భవిష్యత్తులో భారీ డేటాను సురక్షితంగా దాచుకోవడానికి ఒక కొత్త విప్లవాన్ని సృష్టించగలదు. అయితే ఈ ఐడియాతో భారతీయ ఇన్వెస్టర్లను ఆశ్రయించినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన లభించలేదు. డీప్-టెక్ వెంచర్లు లాభాలు ఆర్జించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ మన దేశంలోని ఇన్వెస్టర్లకు మాత్రం అతి తక్కువ సమయంలోనే లాభాలు కావాలి. దీంతో నూతన ఆవిష్కరణల పట్ల రిస్క్ తీసుకునే సాహసం చేయని ఇన్వెస్టర్లు ప్రాజెక్టుకు ఫండింగ్ ఇవ్వడానికి నిరాకరించారు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లభించదు.

దేశంలో సరైన సపోర్ట్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన అనఘా రాజేష్.. చివరికి తాను కష్టపడి నిర్మించిన బెంగళూరు ల్యాబ్‌ను చాలా తక్కువ ధరకే అమ్మేసుకుని అమెరికాకు మకాం మార్చవలసి వచ్చింది. కానీ అమెరికాలో అడుగుపెట్టిన క్షణం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన ఆలోచనలోని ప్రత్యేకతను గుర్తించిన అక్కడి ఇన్వెస్టర్లు పెట్టుబడులు అందించేందుకు క్యూ కట్టారు. ఈ ఉదంతాన్ని డాక్టర్ రాజేశ్వరి అయ్యర్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. "ఇండియా గ్లోబల్ సూపర్‌పవర్ కావాలని మాట్లాడుతుంది.. కానీ దేశాన్ని నిర్మించాలనుకునే ప్రతిభావంతులను మాత్రం విలువైన వారిగా గుర్తించడంలో విఫలమౌతోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్..

ఈ ఘటనపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికీ కేవలం ఫుడ్, బ్యూటీ, క్లాత్, డెలివరీ వ్యాపారాల వైపు మాత్రమే మొగ్గు చూపుతారని, రిస్క్ ఎక్కువగా ఉండే డీప్-టెక్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు సాహసించరని కొందరు విమర్శిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అదనపు సంపద ఉండటం వల్ల అక్కడ రిస్క్ తీసుకుంటారని, మన దేశ వెంచర్ క్యాపిటలిస్టులు ఇంకా ఆ స్థాయి పరిణితికి రాలేదని అభిప్రాయపడుతున్నారు. టాలెంట్ ఉన్నా సరైన ప్రోత్సాహం దక్కక మన దేశంలోని ప్రతిభావంతులు విదేశాలకు తరలిపోతుండటానికి అనఘా రాజేష్ ఘటన కళ్లముందు నిదర్శనంగా నిలిచింది.