మాస్కో: ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా, రష్యాల మధ్య దౌత్య చర్చలు దాదాపుగా నిలిచిపోయిన వేళ.. అమెరికా సైనిక రవాణా విమానం రష్యాలో దిగడం కలకలం రేపింది. యూఎస్ మిలటరీకి చెందిన భారీ రవాణా విమానం బోయింగ్ సి–17 గ్లోబ్ మాస్టర్ 3 మంగళవారం మాస్కోలో ల్యాండయింది. పొరుగునే ఉన్న లాత్వియా దేశంలోని అమెరికా ఎయిర్ బేస్ నుంచి ఈ విమానం మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
అయితే, అంతకుముందు రోజు ఈ విమానం అమెరికాలోని మేరీలాండ్ లో ఉన్న ఎయిర్ ఫోర్స్ జాయింట్ బేస్ నుంచి లాత్వియాకు చేరుకోవడం గమనార్హం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ‘ఫ్లైట్ రాడార్24’ ఈ వివరాలను వెల్లడించింది. అయితే, ఈ సైనిక విమానం రాకకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారంలేదని రష్యా ప్రభుత్వ మీడియా కార్యదర్శి ప్రకటించడం సంచలనంగా మారింది.
మేరీలాండ్ లో ఈ బోయింగ్ గ్లోబ్ మాస్టర్ ఫ్లైట్ బయలుదేరిన ఎయిర్ బేస్‌ను అమెరికా ప్రెసిడెంట్‌తో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రులు, ఉన్నతాధికారుల ప్రయాణానికి ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి మాస్కోకు కీలక నేతలు వచ్చి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తోసిపుచ్చారు. ఇప్పట్లో అమెరికా ప్రతినిధులతో ఎలాంటి చర్చలు జరగడంలేదని, అసలు అలాంటి షెడ్యూల్ కూడా లేదని స్పష్టం చేశారు. అదేసమయంలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్‌లో కీలక నేతలు కానీ, ఉన్నతస్థాయి ఉద్యోగులు కానీ ప్రయాణించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సమాచారం.
కాగా, మాస్కోలో ల్యాండైన ఈ గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను అమెరికన్ ఆర్మీ తన బలగాల చేరవేతకు, పెద్ద మొత్తంలో ఆయుధాల రవాణాకు ఉపయోగిస్తోందని సైనిక వర్గాలు వెల్లడించాయి. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మళ్లీ దౌత్య చర్చలు జరిగే అవకాశముందన్న ఊహాగానాల నేపథ్యంలో తాజా పరిణామం ఆసక్తి రేపుతోంది. అయితే విమానం రాకకు చర్చలకు సంబంధం ఉందా లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
