ముంబై: భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత ట్రేడ్ డీల్ తుది దశకు చేరుకుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. దీనిని ఖరారు చేసేందుకు ఇరుదేశాలూ అత్యంత సమీపంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 20న ముంబై వేదికగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరగనున్న కీలక భేటీకి ముందు సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఇంధన సరఫరాలు, చమురు ధరలు, జాతీయ భద్రతా అంశాలు..రష్యా చమురు ఆంక్షలపై అమెరికా తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని వివరించారు.
ప్రపంచ ఇంధన సరఫరా, ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని గత కొన్ని నెలలుగా కొన్ని ఆంక్షలను మినహాయించాల్సి వచ్చిందని తెలిపారు. ‘‘జాతీయ భద్రతా మినహాయింపులపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు అమెరికా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. భౌగోళిక పరిస్థితులు వాస్తవమైనవి. కొన్ని దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధనాన్ని సమకూర్చుకోవడం ఎంతో క్లిష్టమైన విషయం” అని వ్యాఖ్యానించారు.
విదేశాంగ విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ అంశాల మధ్య బ్యాలెన్స్ పాటించాల్సి ఉంటుందన్నారు. కాగా, భారత్–-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల కీలక విషయాలు వెల్లడించారు. తొలి దశ వాణిజ్య ఒప్పందం ఖరారైందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ పరిశీలన జరుగుతోందని తెలిపారు.
కీలక రంగాలపై చర్చలు
ముంబైలో జరగనున్న జైశంకర్, మార్కో రూబియోల భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా చర్చలు సాగనున్నాయి. ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగం, కీలకమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలాంటి అంశాలపై ఇరువురు నేతలు లోతుగా సమీక్షించనున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు.
