V6 -వెలుగుకు సోషల్ మీడియాలో తిరుగులేని ఆదరణ

V6 -వెలుగుకు సోషల్ మీడియాలో తిరుగులేని ఆదరణ

ఉద్యమ కాలంలో పుట్టిన V6 న్యూస్​ను జనమే ఆదరించి నిలబెట్టి ముందుకు నడిపిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ఎన్ని ఒత్తిళ్లున్నా జనంవైపే బలంగా నిలబడేంత శక్తినిచ్చారు. దానికి కొనసాగింపుగా V6 మీడియా నుంచి వచ్చిన వెలుగు దినపత్రిక కూడా ప్రజలపక్షంగా నిలబడ్డది. ఇప్పటికి V6 న్యూస్- వెలుగు మీడియాను యూట్యూబ్ నుంచి ట్విట్టర్ వరకు ఫాలో అయ్యేవారి సంఖ్య దాదాపు ఒక కోటీ 34 లక్షల మంది. ఒక్క యూట్యూబ్ లోనే దాదాపు కోటి మంది సబ్​స్ర్కైబర్స్ ఉంటే, ఫేస్ బుక్, వెబ్ సైట్, ఈ-పేపర్, తక్కిన సోషల్ వేదికల్లో దాదాపు 34 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇది మన తెలంగాణ జనాభాలో మూడో వంతుకు పైనే. ఈ సంఖ్య కేవలం సోషల్ వేదికల ద్వారా వార్తలు ఫాలో అయ్యేవారే. రోజూ చానెల్ చూసే ప్రేక్షకులు, నేరుగా పేపర్ చదివే పాఠకుల సంఖ్య ఇంకెన్నో రెట్లు.

కొత్తగా పుట్టిన చిన్న రాష్ట్రంలో... కేవలం వార్తల మీదే ఆధారపడిన మీడియాకు ఇంత ఆదరణ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అరుదైన గౌరవం. మన ప్రాంతానికే ప్రత్యేకమైన భాష, బతుకు, పండుగలు, సంస్కృతి, సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ.. మన మట్టి వాసనతో నిండి ఉండడమే V6 న్యూస్ -వెలుగును జనం ఇంత ఆదరించడానికి కారణం. నాడు ఉద్యమానికి వేదికగా నిలిచిన చానెల్ మన రాష్ట్రం తెచ్చుకున్నాక ప్రతిక్షణం జనం ఆకాంక్షలకే పెద్దపీట వేసింది. వ్యక్తిగత విమర్శలు, సినిమా గాసిప్పులు, కుటుంబాల్లో పంచాయితీలను స్టూడియోల్లో తీర్చే సంచలనాలకు పోకుండా ఇంత ఆదరణ తెచ్చుకోవడం ఇప్పటి మీడియా లెక్కల్లో పెద్ద సంచలనమే. జనానికి నీళ్లు-, రోడ్ల గోస నుంచి బడి పిల్లల బువ్వ తిప్పల వరకు, రైతు కష్టాల నుంచి చిన్న వర్గాలు, కులాల బాధల వరకు... ‘సేల్’ కాని వార్తలంటూ ఏ మీడియా పట్టించుకోని జనం వార్తలే V6 ప్రధాన కథనాలు. మీడియా రేటింగ్ వార్తల థియరీని జనం తిరగరాస్తారనడానికి V6 న్యూస్- వెలుగుకు దక్కిన గౌరవమే నిలువుటద్దం. మీడియా పండితులు స్టడీ చేయాల్సిన జనం సబ్జెక్ట్ ఇది.

జనం వార్తలు చెప్పినా, జనం వాయిస్ వినిపించినా, జనం అక్కున చేర్చుకున్నా మన ప్రభుత్వానికి నచ్చదు. ప్రజల మీడియాగా ఉన్న V6 న్యూస్ -వెలుగును జనం సమస్యలు పట్టని అధికార పార్టీ బ్యాన్ చేసింది. అధికార పార్టీ సొంత మీడియానే చూడాలని సొంత పార్టీవారినే బతిమాలుకునే దుస్థితికొచ్చింది. V6 న్యూస్- వెలుగుకు జనం ఆదరణ లెక్కలే సర్కారు తప్పుడు ప్రచారాలకు సూటి జవాబు. 

నిజానికి ఎవరి గొప్పలు వారు చెప్పుకోవడాన్ని జనం ఇష్టపడరు. కానీ జనం గుండెల్లో పెట్టుకొని ఇచ్చిన కొండంత బలాన్ని చెప్పుకోవడం ఈ సందర్భంలో గౌరవంగా భావిస్తున్నాం. ఇది రోజూ చెప్పుకునే ముచ్చట కాదు. అండగా నిలిచే జనానికి శనార్తులు ఇవ్వడానికయినా చెప్పుకోవాల్సిన మంచి మాట. జనం తిప్పలు చెప్పడానికి ఒకే పెద్ద దిక్కుగా ‘V6 న్యూస్- వెలుగు’ ఉన్నాయని సర్కారే ఎలుగెత్తి చెబుతున్నప్పుడు ప్రజల మీడియాగా మా బాధ్యత మరింత పెరిగిందని నమ్ముతున్నాం. ప్రతినెలా సోషల్ మీడియాలో అంతకంతకు పెరుగుతున్న సబ్​స్ర్కైబర్స్, వ్యూసే దీనికి నిదర్శనం. ఈ ఆదరణను, గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని మూడున్నర కోట్ల ప్రజలకు వినమ్రంగా మాటిస్తున్నాం. 

-కోటి వందనాలతో...

- అంకం రవి, చీఫ్ ఎడిటర్