వాషింగ్టన్: హెచ్-1బీ వీసా నిబంధనలు, గ్రీన్ కార్డు ఫైలింగ్‌లపై దుమారం రేపుతున్న వేళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. విదేశీ ఉద్యోగులను (ఇండియన్స్) ఉద్దేశించి తాను గతంలో చేసిన ‘బానిసలు’ (ఇండెంచర్డ్ సర్వెంట్స్) అనే పద ప్రయోగం సరికాకపోవచ్చని అంగీకరించారు. ఈమేరకు ఆదివారం ఆయన వివరణ ఇచ్చారు. తన అత్త మామలు సౌత్ ఇండియానుంచి వచ్చినవారేనని, వారిపై తనకు ఎనలేని గౌరవం, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు.
అమెరికా కంపెనీలు స్థానిక నిరుద్యోగులను కాదని తక్కువ వేతనాల కోసం విదేశీయులను నియమించుకోవడాన్ని తప్పుబడుతూ, ‘‘స్థానిక అమెరికన్లు సంతోషంగా చేయగలిగే ఉద్యోగాల కోసం బయటి దేశాల నుంచి బానిసలను దిగుమతి చేసుకోవడం ఆపండి” అంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి.
భారత నిపుణులను కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీంతో వాన్స్ తాజాగా దీనిపై స్పందించారు. ‘‘నేను వాడిన పదం సరైనది కాదు. ప్రసంగంలో ఏమైనా లోపాలు ఉంటే.. అది పూర్తిగా నా తప్పే. హెచ్-1బీ వీసాదారులను టార్గెట్ చేసుకోవాలనేది నా ఉద్దేశం కాదు” అని వివరణ ఇచ్చారు.
అమెరికన్ల ఉపాధి గురించి అలా మాట్లాడా..
అమెరికా కంపెనీలు, వీసా వ్యవస్థ గురించి తాను మాట్లాడాలనుకున్నానని వాన్స్ చెప్పారు. ఉద్యోగులు అమెరికాకు హెచ్-1బీ వీసాపై వస్తారని, వారిని తీసుకున్న కంపెనీలు ఆ పనికి ప్రత్యామ్నాయ అమెరికన్ కార్మికుడు దొరకలేదని పేర్కొంటాయని, దీంతో స్థానికులకు అవకాశాలు దక్కడంలేదని వాపోయారు. దేశంలో తరచుగా ఇదే జరుగుతోందన్నారు. తన ఉద్దేశం వలసదారులను వ్యతిరేకించడం కాదని, అయితే విదేశీ నిపుణుల రాకకూ, స్థానిక అమెరికన్ల ఉపాధి రక్షణకూ మధ్య బ్యాలెన్స్ ఉండాలన్నదే తన వాదనని వాన్స్ చెప్పుకొచ్చారు.
కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న ఓ అమెరికన్ అకౌంటెంట్‌ను తొలగించి, తక్కువ వేతనానికి విదేశాల నుంచి మరొకరిని తెచ్చుకోవడం ఏ రకంగానూ న్యాయం కాదని, ఇది అటు వలసదారులకూ, ఇటు అమెరికన్లకూ మంచిదికాదని వ్యాఖ్యానించారు. ‘‘దక్షిణ భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చిన నా అత్తమామలంటే నాకు చాలా ఇష్టం. అమెరికాలో పుట్టిన వారి కుమార్తె (ఉషా వాన్స్) ఇప్పుడు దేశానికి సెకండ్ లేడీగా ఉన్నారు. ఆమెను చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను, ప్రేమిస్తున్నాను’’ అని వాన్స్ పేర్కొన్నారు.
