Varalaxmi Sarathkumar: డైరెక్టర్‌ని కుక్కతో పోల్చుతూ.. వరలక్ష్మి శరత్ కుమార్ సెటైర్ పోస్ట్ వైరల్

Varalaxmi Sarathkumar: డైరెక్టర్‌ని కుక్కతో పోల్చుతూ.. వరలక్ష్మి శరత్ కుమార్ సెటైర్ పోస్ట్ వైరల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం పోలీస్ కంప్లైంట్ సినిమా చుట్టూ ప్రమోషన్స్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రెస్‌మీట్‌కు రాకపోవడంతో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “డబ్బులు తీసుకోవడం తెలుసు కానీ ప్రమోషన్స్‌కు రావడం తెలియదా?” అంటూ ఆయన మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కౌంటర్ ఇచ్చింది. తన సొషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. “మొరిగే కుక్కలు కరవవు.. కరిచే కుక్కలు మొరగవు. నేను మొరగను.. కానీ, కరుస్తాను” అనే పోస్టు పెట్టి మరింత హీట్ పెంచింది. అయితే, ఎవరిమీద పెట్టిందనేది మాత్రం డైరెక్ట్గా చెప్పకున్నా, ఇది ‘పోలీస్ కంప్లైంట్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా భావిస్తున్నారు.

వరలక్ష్మి ప్రమోషన్స్‌కు రాకపోవడం, అగ్రిమెంట్ ఉల్లంఘించారంటూ డైరెక్టర్ సంజీవ్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. మరోవైపు, ఈ సినిమాలో నటించిన నవీన్ చంద్ర కూడా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారని టీమ్ పేర్కొనడంతో సినిమా విడుదలకు ముందే వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

డైరెక్టర్ ఏమన్నారంటే?

డైరెక్టర్ ఆరోపణల ప్రకారం, వరలక్ష్మి షూటింగ్ సమయంలో సహకరించినప్పటికీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం స్పందన లేకపోవడం వల్ల సమస్య వచ్చిందని చెప్పారు. ఆమె ‘సరస్వతి’ సినిమా కారణంగా డబ్బింగ్ కూడా ఆలస్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో రెమ్యునరేషన్ కోసం మేనేజ్మెంట్ తరచూ సంప్రదిస్తుందని, కానీ ప్రమోషన్స్ విషయంలో స్పందన లేదని విమర్శించారు. హీరో నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో భాగంగా ఉన్నప్పటికీ, తన బిజీ షెడ్యూల్ కారణంగా ప్రమోషన్స్‌కు పరిమితంగానే హాజరవుతున్నారని టీమ్ తెలిపింది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వివాదంపై రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ప్రమోషన్స్ తప్పనిసరి అని కొందరు అంటుంటే, మరికొందరు వ్యక్తిగత షెడ్యూల్స్, ప్రాజెక్ట్ కమిట్‌మెంట్స్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.