కొత్త ఇంటిని నిర్మించుకున్నా లేదా అద్దె ఇంట్లో ఉంటున్నా.. అక్కడ ప్రశాంతత, సుఖసంతోషాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల నమ్మకాలను, వాస్తు సూత్రాలను పాటిస్తుంటారు. అయితే, ఇంట్లో అక్వేరియం పెట్టుకోవడం వల్ల నిజంగానే మంచి జరుగుతుందా ? అలాగే, అనుకోకుండా ఇంట్లోకి గబ్బిలాలు వచ్చి చనిపోతే ఏమైనా అశుభం జరుగుతుందా ? ఇలాంటి ఆసక్తికరమైన వాస్తు సందేహాలకు, వాటి వెనుక ఉన్న నిజాలకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు ఇక్కడ చూద్దాం....
ప్రశ్న: ఈ మధ్యనే మేం గృహప్రవేశం చేశాం. మా బంధువులు వాళ్లింట్లో అక్వేరియం పెట్టుకుంటే మంచి జరిగిందని చెప్పారు. ఇప్పుడు మేం కూడా మా ఇంట్లో అక్వేరియం పెట్టుకోవాలనుకుంటున్నాం. అసలు అక్వేరియం ఎందుకు ఉండాలి ? ఉంటే ఏ వైపు పెట్టుకోవాలి?
జవాబు: ఇంటి అందం కోసం చాలామంది ఇళ్లలో అక్వేరియం పెట్టుకుంటారు. అక్వేరియం ఉన్నా, లేకున్నా ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ అక్వేరియం పెట్టుకోవాలనుకుంటే హాల్లో ఆగ్నేయం లేదా వాయువ్యంలో మాత్రమే ఉండాలి. కానీ ఎవరికో మంచి జరిగిందని, అలా పెట్టుకుంటే అందరికీ మంచి జరుగుతుందని చెప్పలేం..
ప్రశ్న: నేను బ్యాచిలర్. ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి అద్దె ఇంట్లో పెంట్ హౌజ్ లో ఉంటున్నాం. తూర్పు వైపు మెయిన్ డోర్ ఉంది. రాత్రి పూట గబ్బిలాలు వస్తుంటాయి. ఒక్కోసారి ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ కి తగిలి చనిపోతున్నాయి. అలా జరగడం వల్ల మాకు ఏమైనా చెడు జరుగుతుందా ? అలాంటి ఇంట్లో మేం ఉండొచ్చా ? ఖాళీ చేయాలా ?
జవాబు: తూర్పువైపు మెయిన్ డోర్ ఉండటం మంచిదే. కానీ ఇలా గబ్బిలాలు చనిపోతే ఇంటికి అశుభం. అద్దె ఇల్లు కాబట్టి వెంటనే మార్చుకుంటే మంచిది. ఇంట్లో గబ్బిలాలు చనిపోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. ముందు ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పండి. మెయిన్ డోర్ ని వేరే దిక్కున పెట్టమని అడగండి. అయినప్పటికీ వాళ్లు పట్టించుకోకపోతే.. వేరే ఇంటికి మారండి.
