వ్యవసాయం ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. ముఖ్యంగా తెలంగాణ వంటి వ్యవసాయ రాష్ట్రాల్లో రైతు భవిష్యత్తు వర్షాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, అంటే 122 రోజులు ఉంటుంది. ప్రస్తుతం మొత్తం వానాకాలం పూర్తయింది. తెలంగాణలో సాధారణ వర్షాకాల వర్షపాతం సుమారు 720 మిల్లీమీటర్లు. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే దాదాపు 35 శాతం తక్కువ.
ఫలితంగా చెరువులు, కుంటలు, వాగులు, చిన్న జలాశయాలు నిండలేదు. దీంతో సాగునీటితోపాటు తాగునీటి అవసరాలకూ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్, లోయర్ మానేరు, మిడ్ మానేరు, మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధ బ్యారేజీలు వంటి ప్రధాన నీటి వనరుల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికి దిగువన ఉన్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే నిల్వలు తక్కువగా ఉండటం వల్ల సాగునీటి విడుదలపై ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
విద్యుత్ నెట్‌వర్క్‌పై ఒత్తిడి
పడిపోతున్న భూగర్భజలాలు, తీవ్రమైన కరెంట్ సమస్యలు, ఎండాకాలంను తలపించే ఉష్ణోగ్రతలతో రైతులు ఉన్న వరిపంటను కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 29 లక్షల వ్యవసాయ బోరుబావులకు ఉచిత విద్యుత్ సరఫరా అందుతోంది. వర్షాలు లేకపోవడంతో రైతులందరూ బోరుబావులపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఫలితంగా భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరగడమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరుగుతుంది.
వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువ గంటలు నడవడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై అదనపు భారం పడుతుంది. ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోవడం, ఫీడర్లపై లోడ్ పెరగడం, నిర్వహణ వ్యయం అధికమవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అదనపు సబ్సిడీ భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సెప్టెంబర్ 30న 19,893 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కావడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు.
పంటల దిగుబడి తగ్గితే.. ధరలు పెరిగే అవకాశం
వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పెసర్లు, మినుములు వంటి పంటల దిగుబడి తగ్గితే ఆ ప్రభావం నేరుగా మార్కెట్‌పై పడుతుంది. బియ్యం, పప్పుధాన్యాలు, కూరగాయలు, పశుగ్రాసం ధరలు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు ముందు ముందు గణనీయంగా పెరుగుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు, రవాణా, ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నీ ప్రభావితమవుతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది.
బాధ్యతాయుత విద్యుత్ వినియోగం
ఎల్‌నినో ప్రభావం కేవలం రైతు సమస్య కాదు. అది వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగం, ధరల స్థిరత్వం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రతి కుటుంబ జీవన ప్రమాణాన్ని ప్రభావితం చేసే సమగ్ర సవాలు. రైతు పంటను కాపాడటం అంటే రాష్ట్ర భవిష్యత్తును కాపాడినట్లే. ప్రకృతి అనుకూలించకపోయినా, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయం, సమర్థ జల నిర్వహణ, బాధ్యతాయుత విద్యుత్ వినియోగం అవసరం. ప్రభుత్వం–ప్రజలు–రైతులు సమన్వయంతో పనిచేస్తే ఈ సంక్షోభాన్ని అధిగమించడం సాధ్యమే.
నీటి ప్రతి బొట్టు విలువైనదని గుర్తించి నేటి నుంచే సంరక్షిస్తేనే తెలంగాణ సస్యశ్యామలంగా నిలుస్తుంది. ఈ సంక్షోభాన్ని కేవలం ప్రకృతి వైపరీత్యంగా భావించి ఆందోళన చెందడం కంటే తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి. మరోవైపు సౌర విద్యుత్ వినియోగం, సూక్ష్మ సేద్య పద్ధతులు, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణకు ప్రాధాన్యతనివ్వాలి. సంక్షోభ సమయంలో తీసుకునే సరైన నిర్ణయాలే రేపటి వ్యవసాయానికి రక్షణ కవచాలవుతాయి.
విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి
ఎల్‌నినో సంక్షోభ సమయంలో నీటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలి. వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరిగా అమలు చేయాలి. చెరువులు, కుంటలు, కాలువలు పునరుద్ధరించాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా ఉపయోగించాలి. అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువనీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి.
ప్రభుత్వాలు కూడా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలి. ప్రత్యామ్నాయ పంటలపై శిక్షణ ఇవ్వాలి. జలాశయాల్లోని ప్రతి నీటిబొట్టును శాస్త్రీయంగా వినియోగించాలి. భూగర్భ జలాల రీఛార్జ్‌కు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలి.
- దురిశెట్టి మనోహర్
రిటైర్డ్ ఏడీఈ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచన 700 పదాలకు మించరాదు.
