Venkatesh Maala Song: 'మాల వచ్చా చూడు'.. వెంకీ మామ మ్యూజికల్ రచ్చ.. 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్‌పై ఇంకా సస్పెన్స్!

Venkatesh Maala Song: 'మాల వచ్చా చూడు'.. వెంకీ మామ మ్యూజికల్ రచ్చ.. 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్‌పై ఇంకా సస్పెన్స్!

విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరో మ్యూజికల్ ట్రీట్ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47' సినిమా నుంచి రెండో పాట 'మాల' విడుదలైంది. థమన్ స్వరాలు అందించిన ఈ పాటలో వెంకటేష్, నివేదా పేతురాజ్ సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే పాటతో పాటు సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ వస్తుందని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.

వెంకీ మామ జోష్.. 

లేటెస్ట్ గా విడుదలైన 'మాల వచ్చా చూడు' పాటలో వెంకటేష్ తనదైన స్టైల్‌తో అలరించారు. నివేదా పేతురాజ్‌తో కలిసి ఆయన కనిపించిన ఈ రొమాంటిక్ పాటకు థమన్ ఎనర్జిటిక్ సంగీతాన్ని అందించారు. రంగుల హంగులు, ఉత్సాహభరితమైన విజువల్స్‌తో రూపొందిన ఈ సాంగ్ సినిమా ప్రమోషన్లలో కొత్త జోష్ నింపుతోంది.

థమన్ మ్యూజిక్‌లో మ్యాజిక్...

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'నారాయణమ్మ' పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు రెండో సింగిల్‌తో మేకర్స్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే కొత్త పాటతో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని భావించిన అభిమానులకు ఆ విషయంలో స్పష్టత రాకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

అక్టోబర్ 30న థియేటర్లలోకి వస్తుందా?

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉండగా, ఆ తర్వాత వాయిదా పడింది. ప్రస్తుతం అక్టోబర్ 30 విడుదల తేదీగా ప్రచారంలో ఉంది. నిర్మాత నాగవంశీ కూడా ఈ తేదీని ధ్రువీకరించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.  మరి వెంకీ మామ ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తారో చూడాలి..