వర్ష బీభత్సం అంటే ఇదేనేమో... పార్కింగ్ ఏరియాలో కార్లు మొత్తం మునిగిపోయాయి..

వర్ష బీభత్సం అంటే ఇదేనేమో... పార్కింగ్ ఏరియాలో కార్లు మొత్తం మునిగిపోయాయి..

గుజరాత్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు దక్షిణ గుజరాత్ లో జనజీవనం స్తంభించింది. వల్సాద్‌ లోని ఉంబర్‌గావ్ ప్రాంతంలో గురువారం ( జులై 25 ) ఉదయం వరకు కేవలం 16 గంటల్లోనే అపూర్వమైన రీతిలో 1,100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో వరదలు, జలమయమైన పరిస్థితులు నెలకొనగా, వల్సాద్‌లోని వాపిలో నీటిలో మునిగిపోయిన కార్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పై అంతస్తు నుంచి రికార్డ్ చేసిన ఈ వీడియోలో ఓ బిల్డింగ్ పార్కింగ్ ఏరియా నీటితో పూర్తిగా నిండిపోయి కనిపిస్తుంది. పార్కింగ్ బయట చుట్టుపక్కల ప్రాంతం కూడా నీటితో నిండిపోయింది. దీంతో పార్కింగ్ లో ఉన్న సుమారు 50 కార్లు నీట మునిగిపోయాయి. వర్ష బీభత్సం అంటే ఈ వీడియో సరైన ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఉంబర్‌గావ్‌తో పాటు, వల్సాద్‌లోని చాలా ప్రాంతాల్లో కూడా 600 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.ఔరంగ, పార్ మరియు దమన్ గంగా వంటి నదులు పొంగిపొర్లడంతో వల్సాద్‌లో భారీ వరదలు వచ్చాయి. వరదల కారణంగా సూరత్ లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2వేల 200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.