రజినీకాంత్ సినిమా ‘జైలర్ 2’లో కాంత అనే నెగెటివ్ క్యారెక్టర్‌తో నటిగా మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు విద్యాబాలన్. ఇలా కెరీర్లో ఎన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించినా, ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించాలనే తన చిరకాల వాంఛ నెరవేరకపోవడంపై విద్య ఎమోషనల్ అయ్యారు. 2014లో రాజీవ్ మేనన్ డైరెక్షన్లో తాను లీడ్ రోల్లో తెరకెక్కాల్సిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ ఆగిపోవడం గురించి ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
రాజీవ్ గారు ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ రెడీ చేశారని, అయితే కొన్ని కారణాలతో ఆ సినిమాపై స్టే ఆర్డర్ రావడంతో ముందుకెళ్లలేదని ఆమె చెప్పారు. సుబ్బులక్ష్మి పాడిన సుప్రభాతంతోనే తమ ఇంట్లో రోజు మొదలవుతుందని, ఆమె సంగీతం అంటే తనకు ప్రాణం అని, ఆమె జీవిత విశేషాలన్నీ తనకు బాగా తెలుసని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం ఎంఎస్ సుబ్బులక్ష్మికి నివాళిగా ఓ ఫొటోషూట్ చేసి తన కలను కొంత తీర్చుకున్నానని విద్యాబాలన్ తెలిపారు.
ఆ ఫొటోలు వైరల్ అవడంతో ఏడుగురు ఫిల్మ్ మేకర్స్ ఆ లెజెండరీ సింగర్ పాత్ర కోసం తనను సంప్రదించారని, అయితే అన్ని రకాల పర్మిషన్స్ ఉంటేనే ముందుకెళ్దామని స్పష్టం చేసినట్టు ఆమె వెల్లడించారు. ఇక రష్మిక మందన్న లీడ్ రోల్లో ‘ఎం.ఎస్’ అనే టైటిల్‌తో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ రూపొందుతోంది. ఇటీవల చెన్నైలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
