RashmikaVijay: 'రణబాలి' రిలీజ్ వేళ సాయిబాబా సన్నిధిలో విజయ్–రష్మిక.. పుట్టపర్తిలో ప్రత్యేక పూజలు!

RashmikaVijay: 'రణబాలి' రిలీజ్ వేళ సాయిబాబా సన్నిధిలో విజయ్–రష్మిక.. పుట్టపర్తిలో ప్రత్యేక పూజలు!

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ 'రణబాలి' . ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 16న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ కు దగ్గర పడుతున్న వేళ ఈ జంట ఆధ్యాత్మిక బాట పట్టింది. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీరు.. లేటెస్ట్ గా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు.

పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు, వార్షిక వేద పురుష సప్తహ జ్ఞాన యజ్ఞంలో విజయ్-రష్మిక ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో ఈ జంట ఒకే వేదికపై కనిపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వీరి విజువల్స్ క్షణాల్లో వైరల్ అవుతుండటంతో క్రేజ్ తారాస్థాయికి చేరింది. దీంతో ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు, విజయ్ దేవరకొండకు పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విద్యాసంస్థలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన విజయ్, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం విడుదలవుతున్న తరుణంలో ఇక్కడ పూజలు నిర్వహించడం,  సాయిబాబా ఆశీస్సులు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణబాలి' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ALSO READ : 'దేవుడు కాదు.. మనిషే!'.. రణబీర్ రాముడిపై ఇంటర్నేషనల్ ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్..

బ్రిటీష్ పాలనలో రాయలసీమలో తలెత్తిన తీవ్ర కరువు, దాదాపు కోటి మందికి పైగా ఆకలి చావులతో అల్లాడిపోయిన ఒక చీకటి చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ కాన్సెప్ట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుండగా..  సినిమా విజయం కోసం విజయ్, రష్మిక దైవదర్శనాలు చేసుకోవడం విశేషం. అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.