కన్నడ ఇండస్ట్రీలో కొందరు నటులు కేవలం నటనతోనే కాకుండా, తమ మంచితనంతో కూడా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి వారిలో విజయ రాఘవేంద్ర ముందు వరుసలో ఉంటాడు. చిన్న వయసులోనే కెమెరా ముందుకొచ్చి, మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన విజయ్ ప్రయాణం ‘చిన్నారి ముత్త’ సినిమాతో మరోస్థాయికి వెళ్లింది. ఆ మూవీలో ఆయన నటన అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమాలో నటనకుగాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ పాత్ర ప్రభావం ఎంతలా ఉందంటే, ఇప్పటికీ కన్నడ ప్రజలు విజయ రాఘవేంద్రని ముద్దుగా ‘చిన్నారి ముత్త’ అని పిలుచుకుంటారు.
సినిమా ఫ్యామిలీ!
ప్రముఖ నిర్మాత ఎస్.ఏ. చిన్నె గౌడ కొడుకు. దివంగత పునీత్ రాజ్‌కుమార్ బావమరిది. సినిమా వాతావరణం ఆయనకు కొత్తేమీ కాదు. కానీ, మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నప్పుడు చాలా చిన్నవాడు. అయితేనేం అతని కళ్లలో కనిపించిన కాన్ఫిడెన్స్ సీనియర్ యాక్టర్స్లోనే కనిపిస్తుంది అనుకున్నారు అక్కడున్నవాళ్లంతా. అలాగని విజయ్ సినీ ప్రయాణం ఈజీగా సాగలేదు. ప్రతి పాత్రతో తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చింది. “నాకు అవకాశాలు వచ్చాయి.. కానీ నిలదొక్కుకోవడం మాత్రం నా పని” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చిన్న పాత్రలతో మొదలైన ప్రయాణం లీడ్ రోల్స్‌కు బాట వేసింది.
హీరోగా మారిన తర్వాత..
బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాక, ‘నినగాగి’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అది సక్సెస్ కావడంతో ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాల్లో నటించాడు. కొన్ని విజయాలు, మరికొన్ని పరాజయాలు ఎదురైనా ఆయన ఎప్పుడూ నిరాశ చెందలేదు. నటనలో వైవిధ్యం కోసం క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు ఇలా ప్రతి జోనర్‌ని టచ్ చేశాడు. కానీ “ప్రేక్షకుడు కథలో తనను తాను చూసుకోవాలి.. అప్పుడు సినిమా గుర్తుండిపోతుంది” అనే విజయ్ ఆ తర్వాత ఎమోషనల్ స్టోరీలనే ఎంచుకున్నాడు. అవే ఆయన్ను స్టార్ హీరోని చేశాయి. అందుకు నిదర్శనం ఆయన నటించిన ‘శివాయోగి శ్రీపుట్టయ్యప్ప’ సినిమా. ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు, సామాజిక సేవా కార్యకర్త అయిన పండిట్ పుట్టరాజ్ గవాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఆ సినిమాలో పుట్టయ్యప్ప పాత్రలో ఒదిగిపోయిన విజయ్‌ని రాష్ట్ర స్థాయి ఉత్తమ నటుడు అవార్డు వరించింది.
సహజ నటన.. అసలు బలం
విజయ్ రాఘవేంద్ర నటనలో అతి కనిపించదు. చిన్న ఎక్స్‌ప్రెషన్‌తోనే భావాన్ని పలికించగలడు. అదే అతని ప్రత్యేకత. ఒక యాక్టర్‌గా మంచి పేరు రావడానికి కారణం అతని నేచురల్ యాక్టింగే. దానివల్లే ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు అతనికి అవకాశాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు. తనను నటన అంటే ఏంటి? అని అడిగితే.. “నటన అంటే గట్టిగా అరవడం కాదు.. నిశ్శబ్దంలో కూడా భావం ఉండాలి” అంటాడు విజయ్. అందుకే అతను చేసిన పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి.
నవ్వు వెనుక ఉన్న నిశ్శబ్దం
ప్రొఫెషనల్ లైఫ్ బాగానే సాగుతున్నా, వ్యక్తిగతంగా అతను చాలా కఠినమైన దశను ఎదుర్కొన్నాడు. విజయ్‌కి అసిస్టెంట్ కమిషనర్ కూతురు స్పందనతో 2007లో పెండ్లి అయింది. ఆమె గురించి మాట్లాడేటప్పుడు “ఆమె నాకు బలం.. నా ప్రపంచం” అని చెప్పేవాడు.
వాళ్లకి ఒక కొడుకు పుట్టాడు. అన్యోన్యంగా సాగుతోన్న వాళ్ల దాంపత్య జీవితంలో పెద్ద కష్టం వచ్చింది. భార్య కార్డియాక్ అరెస్ట్‌తో దూరమైంది. దాంతో విజయ్ మానసికంగా ఎంతో వేదన అనుభవించాడు. ఆ బాధను బయటపెట్టకుండా మళ్లీ పనిలోకి రావడం అంత ఈజీ కాదు. కానీ విజయ్ “జీవితం ఆగదు... మనం కూడా ఆగకూడదు” అని తనకు తాను సర్ది చెప్పుకున్న విధానం అతని మనో ధైర్యానికి అద్దం పడుతుంది. కెమెరా ముందు నవ్వినా, ఆ నవ్వు వెనుక ఉన్న నిశ్శబ్దం చాలామందికి అర్థమైంది.
కొత్త పాత్రలు
విజయ్ ప్రస్తుతం పాత్రల సెలక్షన్లో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. కేవలం హీరోగా కాకుండా, కథకు బలం ఇచ్చే పాత్రలు చేయాలనుకుంటున్నాడు. “పాత్ర చిన్నదా? పెద్దదా? అనేది ముఖ్యం కాదు.. అది మనసుకు తాకాలి” అనే ఆలోచనతో కథలను ఎంచుకుంటున్నాడు. లేటెస్ట్గా వచ్చిన ‘సెకెండ్ కేస్ ఆఫ్ సీతారామ్’ కూడా అలాంటిదే. ఇందులో ఇన్స్పెక్టర్ సీతారామ్‌గా నటించాడు.విజయ రాఘవేంద్ర ప్రయాణం మనకు ఒక విషయాన్ని నేర్పిస్తుంది.
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి విజయం దక్కినా ఒదిగి ఉండటమే అసలైన వ్యక్తిత్వం అని. మారుతున్న కాలానికి అనుగుణంగా విజయ రాఘవేంద్ర తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. నిర్మాతగా, దర్శకుడిగా త్వరలో ఆయన మెగా ఫోన్ పట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సినీ పరిశ్రమలోకి వచ్చే కొత్త నటులకు శిక్షణ ఇచ్చేలా ఒక వర్క్‌షాప్ లేదా అకాడమీని ప్రారంభించే ఆలోచన కూడా ఆయన ఫ్యూచర్ ప్లాన్స్‌లో ఉంది.
సినిమాలతో పాటు టెలివిజన్‌లో..
సినిమాలతో పాటు టీవీ ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా బిగ్ బాస్ కన్నడలో కనిపించినప్పుడు విజయ్ అసలు స్వభావం అందరికీ తెలిసింది. అక్కడ డ్రామా లేదు.. నటన లేదు.. ఒక సాధారణ మనిషి మాత్రమే కనిపించాడు. ఆ షోలో “ఇక్కడ నేను యాక్ట్ చేయలేను.. నేను ఎలా ఉంటానో అలా ఉన్నా” అని చెప్పిన మాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అతని వ్యక్తిత్వమే బిగ్ బాస్ సీజన్ -1లో విజేతగా నిలిపింది.
ఇదే కాకుండా డ్రామా జూనియర్స్, డాన్సింగ్ చాంపియన్ వంటి షోలలో జడ్జిగా చేశాడు. అలా టీవీ ప్రేక్షకులకు మరింత సుపరిచితం అయ్యాడు విజయ్. అతనికి కూడా అభిమానులంటే ఎంతో ఇష్టం. అభిమానులతో అతనికి ఉన్న అనుబంధం చాలా సహజంగా ఉంటుంది. సోషల్ మీడియాలో తన భావాలు పంచుకుంటూ, వాళ్లతో మాట్లాడుతుంటాడు. “వాళ్లు లేకపోతే నేను లేను” అని చెప్తుంటాడు.
