విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల తొలిరోజు ( అక్టోబర్ 11) జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల తొలిరోజు శ్రీ కనకదుర్గమ్మ వారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. అయితే ఉత్సవాల తొలిరోజే భక్తులకు దర్శన కష్టాలు మొదలయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు క్యూలైన్లలో ఉచిత దర్శనం కల్పిస్తామని ప్రకటించిన అధికారులు, వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. జై దుర్గమ్మ.. జై జై దుర్గమ్మ అంటూ భక్తుల నామస్మరణతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మార్మోగుతున్నాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు ప్రకటించారు.అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.
దసరా ఉత్సవాల తొలిరోజే దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు లైన్లలో ఉచిత దర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, సామాన్య భక్తులకు దర్శనం ఆలస్యమవుతోంది. మరోవైపు వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన భక్తులు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంన్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉచిత దర్శన క్యూలైన్లను వేగవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు. దసరా ఉత్సవాలు మరో తొమ్మిది రోజుల పాటు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దర్శన ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మరి భక్తుల ఆరోపణలపై ఆలయ అధికారులు ఎలా స్పందిస్తారు? ఉచిత దర్శన క్యూలైన్లలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం...!
