Jana Nayagan Day 2 Collection: విజయ్ 'జన నాయకన్'కు షాక్.. రెండో రోజు భారీగా కలెక్షన్స్ డ్రాప్, వీకెండ్‌పైనే ఆశలు!

Jana Nayagan Day 2 Collection: విజయ్ 'జన నాయకన్'కు షాక్.. రెండో రోజు భారీగా కలెక్షన్స్ డ్రాప్, వీకెండ్‌పైనే ఆశలు!

తమిళ స్టార్ హీరో , సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయకన్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్ డ్రామా కేవలం రెండు రోజుల్లోనే రూ.112.50 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూలు చేసి రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అయితే తొలి రోజు వచ్చిన భారీ స్పందనను రెండో రోజు కొనసాగించలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది.

రెండో రోజు సగానికి కలెక్షన్స్ డ్రాప్..

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం తొలి రోజు రూ.42.70 కోట్ల ఇండియా నెట్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు రూ.21.15 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. దీంతో కలెక్షన్లు దాదాపు 50.5 శాతం పడిపోయాయి. అయినప్పటికీ రెండు రోజుల్లో ఇండియా నెట్ రూ.63.85 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.75 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ.37.50 కోట్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా రూ.112.50 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.

గత చిత్రాలకు భిన్నంగా.. 

రెండో రోజు తమిళ వెర్షన్ రూ.17.95 కోట్ల నెట్ తో ఆధిపత్యం చాటుకుంది. ఇక  హిందీ డబ్బింగ్ రూ.1.85 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.1.35 కోట్లు వసూలు చేసింది. తమిళనాడే ఈ చిత్రానికి ప్రధాన బలం గా నిలిచింది. అటు కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, కేరళలో కూడా మంచి వసూళ్లు నమోదుచేసుకని పర్వాలేదు అన్న టాక్ ను  సొంతం చేసుకుంది. అయితే విజయ్ గత చిత్రాలు'లియో', 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'సాధించిన తొలి రెండు రోజుల వసూళ్లను మాత్రం 'జన నాయకన్'అందుకోలేకపోయింది. 

వీకెండ్ పైనే ఆశలు..

సుమారు రూ.300- నుంచి400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మూడు గంటలకు పైగా నిడివితో విడుదలైంది. ఈ సినిమాకు విజయ్ రూ.220 నుంచి రూ.240 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న వెట్రి జీవితంలో జరిగే సంఘటనలు, అతని గతం బయటపడటం, విలన్ జాన్ హిమ్లర్‌తో జరిగే పోరాటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ సినిమా తొలి రోజు నుంచే విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ అభిమానులు మాత్రం థియేటర్ల వద్ద బాణాసంచా, లేజర్ షోలు, భారీ వేడుకలతో విజయ్‌కు ఘన వీడ్కోలు పలుకుతున్నారు. విజయ్ సొంత గడ్డ తమిళనాడులో మరింత వసూళ్లు సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  అటు  వీకెండ్ కలెక్షన్లే ఈ సినిమా అసలు బాక్సాఫీస్ స్టామినాను నిర్ణయించనున్నాయని పేర్కొంటున్నారు.