ఎన్నికల ఖర్చు చూసుకున్న ఆ ఇద్దరికీ మంత్రి పదవులు.. విజయ్ టీవీకే పార్టీ విరాళాల లిస్టు

ఎన్నికల ఖర్చు చూసుకున్న ఆ  ఇద్దరికీ మంత్రి పదవులు.. విజయ్ టీవీకే పార్టీ విరాళాల లిస్టు

తమిళనాడులో అసెంబ్లీ  ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, అధికారం చేపట్టిన టీవీకే పార్టీ డొనేషన్ల వివరాలను వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆ పార్టీకి 13 కోట్ల 30 లక్షల రూపాయల విరాళం వచ్చినట్లు పేర్కొంది. అందులో ప్రస్తుతం మంత్రులు ఆధవ్ అర్జున, ఆర్వీ రంజిత్ కుమార్ ఇద్దరే 99 శాతం విరాళాలు ఇచ్చినట్లు ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొంది. 

రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అర్జున ఒక్కరే ఏకంగా 8 కోట్ల 20 లక్షల విరాళాలు అందజేశారు. ఆయన తర్వాత మరో మంత్రి రంజిత్ 5 కోట్లు పార్టీకి ఇచ్చారు. పార్టీకి 2025-26లో  వచ్చిన విరాళాలలో అర్జున కంట్రిబ్యూషనే దాదాపు 60 శాతంపైగా ఉంది. వీరిద్దరికి తోడు మరో ఇద్దరు నేతలు చెరో 5 లక్షల విరాళాలు ఇచ్చారు.  

తూత్తుకుడిలోని స్నో షో అనే ఆర్గనైజేషన్ డీడీ రూపంలో 5 లక్షలు ఇవ్వగా.. స్నో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనే కంపెనీ కూడా డీడీ రూపంలో మరో ఐదు లక్షలు ఇచ్చింది. 

ఇక ఎన్నికల సంఘం వెల్లడించిన డొనేషన్ల వివరాల ప్రకారం.. అన్నాడీఎంకే పార్టీకి 161 కోట్ల 35 లక్షల విరాళాలు వచ్చాయి. టైగర్ అసోసియేట్స్ అనే సంస్థ 135 కోట్లు డొనేట్ చేసింది. 

ఇక ప్రతిపక్ష డీఎంకే పార్టీకి 191 కోట్ల 19 లక్షల రూపాయల విరాళాలు రాగా.. టైగర్ అసోసియేట్స్ 125 కోట్లతో టాప్ కంట్రిబ్యూటర్ గా ఉంది. కోల్‌కతాకు చెందిన లాటరీ సంస్థ టైగర్ అసోసియేట్స్‌కు, లాటరీ దిగ్గజం శాంటియాగో మార్టిన్‌కు ఒక ఉమ్మడి వ్యాపార భాగస్వామి ద్వారా సంబంధం కొనసాగుతోంది. 

దీని  భాగస్వామి అయిన సుబ్బయన్ నాగరాజన్, మార్టిన్‌కు చాలా కాలంగా సహచరుడు. కార్పొరేట్ రికార్డుల ప్రకారం వీళ్లిద్దరూ కలిసి మరొక సంస్థలో పార్టనర్ షిప్ కలిగి ఉండటం గమనార్హం.

మార్టిన్ కంపెనీకి  చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్.. అత్యధిక ఎలక్ట్రోరల్ బాండ్ కొనే సంస్థ. 2024 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ రద్దు చేసేవరకు అత్యధికంగా ఎలక్ట్రోరల్ బాండ్స్ కలిగి ఉండేది. అయితే స్కీం రద్దయిన తర్వాత  ఆ డీఎంకేకు 509 కోట్ల రూపాయలు విరాళాలు అందినట్లు తమిళమీడియా పేర్కొంది.