పండుగలా గ్రామ సభలు.. రిఫార్మ్ ఉత్సవ్ లో భాగంగా పల్లెల్లో ప్రత్యేక సమావేశాలు

పండుగలా గ్రామ సభలు.. రిఫార్మ్ ఉత్సవ్ లో భాగంగా పల్లెల్లో ప్రత్యేక సమావేశాలు
  • ప్రజల భాగస్వామ్యంతో జీపీడీపీ ప్రణాళికలు
  • గ్రామ సమస్యలు, వనరులపై స్థానికులతో చర్చ, ఏకగ్రీవ తీర్మానాలు 

హైదరాబాద్, వెలుగు : గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. పల్లెల రూపురేఖలు మార్చేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ చేపట్టిన రిఫార్మ్ ఉత్సవ్ లో భాగంగా పంచాయతీల్లో ప్రజలు భాగస్వాములయ్యారు. 

గ్రామాల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులను బేరీజు వేసుకుంటూ రాబోయే ఆర్థిక సంవత్సరానికి సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను (జీపీడీపీ) ఖరారు చేశారు. లింగంపల్లి గ్రామంలో జరిగిన సభకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ పాల్గొని మాట్లాడారు. గ్రామసభల సందర్భంగా పంచాయతీ కార్యాలయాల ప్రాంగణాల్లో మహిళలు, సిబ్బంది వేసిన రంగు రంగుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్ మండలం బండరావిర్యాలలో వీజీపీపీ ప్లాన్‌‌‌‌ను ముగ్గుల రూపంలో వేశారు. శంషాబాద్ పరిధిలోని కవ్వగూడ, మహబూబాబాద్ జిల్లాలోని పలు పంచాయతీల్లో వినూత్న రీతిలో గ్రామ నక్షాలను ప్రదర్శించారు. గ్రామంలోని అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, తాగునీటి వనరులు, పాఠశాలలు, అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలు, పారిశుధ్య స్థితిగతులను ముగ్గుల రూపంలో గీసి, ఎక్కడెక్కడ ఏయే పనులు చేపట్టాలో ప్రజలతో చర్చించి తీర్మానించారు. 

అదేవిధంగా తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో పాటు భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉపాధి హామీ పనుల కల్పన, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక బలోపేతం, రైతుల పంట కుంటలు, కల్లాల నిర్మాణం తదితర అంశాలను అభివృద్ధి ప్రణాళికలో చేర్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, డీపీవోలు, ఎంపీడీవోలు, కార్యదర్శులు గ్రామసభల్లో పాల్గొని ప్రజల నుంచి వినతులు, సూచనలు స్వీకరించారు.

తీర్మానాలు కాగితాలకే పరిమితం కావొద్దు : మంత్రి సీతక్క

గ్రామసభల్లో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షలు, ఏకగ్రీవంగా తీసుకున్న తీర్మానాలు కేవలం రికార్డులకే పరిమితం కాకూడదని,  ప్రణాళికాబద్ధంగా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.  గ్రామసభల్లో గుర్తించిన ప్రాధాన్యతలను జీపీడీపీలో పొందుపరిచి, ప్రభుత్వ నిధులు, పథకాలను సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే పల్లెలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయన్నారు.