కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడరూరల్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారంలో సేవా సంకల్ప అభియాన్ డిజిటల్ ఎడ్యుకేషన్, ఏఐ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస్​ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని, నాణ్యమైన విద్య కోసం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

వేములవాడ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకువచ్చామని, ఆరుట్లలోని పాఠశాలలో 1,500 సీట్లు పూర్తిగా నిండటం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ముచ్చర్ల ప్రాంతంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వేములవాడ పీఏసీఎస్ చైర్మన్ వకుళాభరణం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సోయినేని కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.