‘‘ఒక్క కోరిక కోరే అవకాశం వస్తే మీరు ఏం కోరుకుంటారు?’’ ఈ ప్రశ్న ఎవరినడిగినా వెంటనే ఓ సమాధానం చెప్తారు. అయితే అదే కోరిక మీ జీవితాన్నే తలకిందులు చేస్తే? ఇదే కాన్సెప్ట్‌తో రూపొందిన హారర్ మూవీ ‘అబ్సెషన్’లో కనిపించే ‘వన్ విష్ విల్లో’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వన్ విష్ విల్లో అనేది సినిమాలో కనిపించే విల్లో చెక్కతో చేసిన చిన్న వస్తువు. దాన్ని విరిచి ఒక కోరిక కోరితే అది నెరవేరుతుందని కథ చెప్తుంది. అయితే జీవితంలో ఒక్కసారి మాత్రమే దీన్ని ఉపయోగించొచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కోరిక నెరవేరినా, అది మనం అనుకున్నట్లు కాకుండా అనుకోని పరిణామాలకు దారితీస్తుంది.
ఈ ఆలోచనకు1902లో డబ్ల్యూ. డబ్ల్యూ. జాకబ్స్ రాసిన ప్రసిద్ధ కథ ‘ది మంకీస్ పా’ ప్రేరణ అని దర్శకుడు కరీ బార్కర్ చెప్పారు. ఈ సినిమాలో బేర్ అనే యువకుడు, నిక్కీ తనను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటాడు. వన్ విష్ విల్లోను ఉపయోగించిన తర్వాత అతని కోరిక నెరవేరుతుంది. కానీ ఆ ప్రేమ క్రమంగా ప్రమాదకరమైన వ్యామోహంగా మారి, వారి జీవితాలను భయానకంగా మార్చేస్తుంది.
నిజానికి వన్ విష్ విల్లో అనేది నిజమైన శాపగ్రస్త వస్తువు కాదు. సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన కల్పిత వస్తువు మాత్రమే. అయితే ప్రేక్షకులు నిజమని నమ్మేలా దీనిని సాధారణ గిఫ్ట్‌లా డిజైన్ చేశారు. అంతేకాదు, ప్రత్యేక వెబ్‌సైట్, పాతకాలపు ప్యాకేజింగ్, ఉత్పత్తి వివరాలతో నిజంగా అమ్ముతున్న వస్తువులా ప్రచారం చేశారు. ఈ వినూత్న మార్కెటింగ్ వల్ల చాలామంది ఇది నిజంగానే ఉందని భావించారు.
అభిమానుల కోసం ఫోకస్ ఫీచర్స్ అధికారిక వెబ్‌సైట్‌లో దీని కలెక్టిబుల్ రెప్లికాలను 6.99 నుంచి14.99 అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 600 – రూ.1,300) ధరకు అమ్మారు. కొద్దిరోజుల్లోనే ఇవన్నీ అమ్ముడుపోయాయి. ప్రస్తుతం అఫీషియల్ స్టాక్ లేకపోయినా ఈబే వంటి రీసేల్ వెబ్‌సైట్లలో ఇవి ఎక్కువ ధరలకు లభిస్తున్నాయి. మొత్తానికి కథ, డిజైన్, తెలివైన మార్కెటింగ్ కలిసి ఒక కల్పిత వస్తువును ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేశాయి. వన్ విష్ విల్లో ఇప్పుడు కేవలం సినిమా ప్రాపర్టీ మాత్రమే కాదు.. హారర్ అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.
