ఒక సగటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కంటే కూడా భారీగా వేతనం సంపాదిస్తూ సొంత ఇల్లు, కారు అన్నీ సంపాదించుకుంది చైనాలోని ఒక మహిళ. 38 ఏళ్ల వయస్సులోనే ఇంత స్థాయికి ఎదిగినప్పటికీ ఆమెను వెంటాడుతున్న విషయం ఒంటరితనం. అవును కెరీర్, లైఫ్ సెట్ అయ్యినప్పటికీ ఇంత సంపాదిస్తున్నప్పటికీ తనను పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రాకపోవటంపై కన్నీరు మున్నీరు అయ్యింది చైనాలో ఒక మహిళ. భారతదేశంలో నాలుగు పదుల వయస్సు వచ్చినా అబ్బాయిలకు పెళ్లి కూతుళ్లు దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో చైనాలో జరిగిన ఘటన వింతగా కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
చైనాలోని ఒక ప్రసిద్ధ ‘మ్యారేజ్ మార్కెట్’ నుంచి వచ్చిన ఒక వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. అక్కడ 38 ఏళ్ల ఒక విజయవంతమైన మహిళ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన మాటలు.. చైనా సమాజంలో పెళ్లికాని అమ్మాయిలపై ఉండే తీవ్రమైన సామాజిక ఒత్తిడిని మరోసారి చర్చకు తెచ్చాయి. సదరు మహిళ ఏడాదికి దాదాపు 5లక్షల యువాన్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.70 లక్షల వరకూ సంపాదిస్తూ.. ఆర్థికంగా ఎంతో నిలదొక్కుకుంది. అయితే కేవలం ఆమె వయసును బట్టి 'పెళ్లికి పనికిరాదు' అన్నట్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులే స్వయంగా తమ పిల్లల బయోడేటాలను పట్టుకుని.. ఆస్తి, చదువు, ఉద్యోగం, వయసు ఆధారంగా బేరసారాలు సాగించే ఈ మార్కెట్‌లో వయసు పైబడిందనే కారణంతో ఆమెను తిరస్కరించడంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన బాధను బయటపెట్టింది వీడియోలో కనిపిస్తోంది.
A Chinese "leftover" Woman has a meltdown at weekly bride's market in China
— Muji Singh Rangi (@mujifren) June 17, 2026
She pleads her case with parents of potential groom's, who have travelled from neighbouring city to look for a bride for their Sons
She shouts that she earns 500,000 Yuan and has a good job, yet no one… pic.twitter.com/yGEzRcqdzw
ఈ వీడియో వెలుగులోకి రావడంతో చైనాలో ఎప్పటి నుంచో ఉన్న ‘షెంగ్ ను’ అనే పదం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. చైనా సంప్రదాయాల ప్రకారం 20 ఏళ్లు దాటిన చదువుకున్న, అవివాహిత మహిళలను మిగిలిపోయిన మహిళలుగా హీనంగా చూస్తుంటారు. మహిళలు ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించినా పెళ్లి మార్కెట్‌లో మాత్రం ఇప్పటికీ చైనాలో వయసుకే తొలి ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీని విశ్వసనీయతపై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొందరు దీనిని ఏఐ సృష్టించిన నకిలీ వీడియోగా భావించినప్పటికీ.. చైనా స్థానిక మీడియా వార్తా కథనాల ప్రకారం ఇది నిజమైన ఘటనేనని తేలింది. చైనాలోని షాంఘై, బీజింగ్ వంటి నగరాల్లో ఇలాంటి వీక్లీ మ్యాచ్ మేకింగ్ మార్కెట్లు సర్వసాధారణమే.
చైనాలో యువత ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ఆధునిక మహిళలు సంప్రదాయ వివాహ బంధాల కంటే తమ కెరీర్, స్వేచ్ఛ, వ్యక్తిగత ఎదుగుదలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రులు, సమాజం నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. కేవలం పెళ్లి కోసమే తమ జీవితాలను త్యాగం చేయడానికి వారు సిద్ధంగా లేరు. ఈ మార్పుల కారణంగానే చైనాలో పెళ్లిళ్ల రేటు భారీగా పడిపోతోంది. ఈ వైరల్ వీడియో కేవలం ఒక మహిళ కన్నీటి గాథ మాత్రమే కాదు.. పాతకాలపు కట్టుబాట్లకు, ఆధునిక మహిళల ఆకాంక్షలకు మధ్య జరుగుతున్న నిశ్శబ్ద పోరాటానికి సజీవ సాక్ష్యంగా మారింది.
