
టైటిల్ : విరాటపాలెం, ప్లాట్ ఫాం : జీ5, డైరెక్షన్ : కృష్ణ పోలూరు, కాస్ట్ : అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకర, రామరాజు, సురభి ప్రభావతి, గౌతమ్ రాజు
మీనా (అభిజ్ఞ వూతలూరు) 1980ల్లో ఒంగోలులోని విరాటపాలెం అనే గ్రామానికి పోలీస్ కానిస్టేబుల్‌గా వెళ్తుంది. ఆ ఊరికి అమ్మవారి శాపం ఉందని అందరూ నమ్ముతారు. కొన్నేండ్లుగా ఆ ఊళ్లో పెండ్లి జరిగిన ప్రతిసారి పెండ్లి కూతుళ్లు చనిపోతుంటారు. పెండ్లి పీటల మీద లేదంటే పెండ్లి జరిగిన కొన్ని గంటల్లోనే రక్తం కక్కుకుని ప్రాణాలు కోల్పోతారు. దాంతో కొంతమంది తమ ఆస్తులు అమ్ముకుని ఊరు వదిలి వెళ్లిపోతారు. మరికొందరు తమ పిల్లల్ని చుట్టుపక్కల ఊళ్లకు తీసుకెళ్లి పెండ్లిళ్లు చేసి, అక్కడే కాపురం పెట్టిస్తుంటారు.
మూఢ నమ్మకాలు లేని మీనా ఆ చావుల మిస్టరీని ఎలాగైనా ఛేదించాలి అనుకుంటుంది. అదేటైంలో సొంతూరిని వదిలివెళ్లడం ఇష్టం లేని ఓ కుర్రాడు అదే ఊళ్లో ఉంటున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరుసటిరోజే ఆమెకూడా చనిపోతుంది. దాంతో మీనా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. అప్పుడే ఆ ఊరి ప్రెసిడెంట్ (రామరాజు) మీనాని తన కొడుక్కిచ్చి, తన ఇంట్లోనే పెండ్లి చేయాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పెండ్లి కూతుళ్ల చావుల వెనుక ఉన్న మిస్టరీని మీనా ఛేదించిందా? లేదా? తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.