
విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గామి’. చాందినీ చౌదరి హీరోయిన్. వి.సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించారు. శనివారం మొదటి పాటను విడుదల చేశారు. ‘సొమ్మసిల్లి పోయి కూలింది కాలం, సత్తువంటు లేక ఇంకెంతకాలం... సన్నగిల్లకుంది ఈ వింత దూరం, దిక్కుతోచకుండ ఇంకెంత దూరం..’ అంటూ పాట మొదలైంది. ఇందులో మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధి ఉన్న అఘోరాగా విశ్వక్ సేన్ నటించాడు.
వ్యాధికి మందు వెతికేందుకు చేసే అన్వేషణ నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. అందుకు తగ్గట్టుగా ‘కాలకూటమైన ఈ తీపి స్పర్శ.. అమృతంగా మారే దారుందా ఈశా.. తనువు నీలమవుతూ పెడుతుంటే ఘోష.. జీవమున్నా చావు పొందిందా శ్వాస.. గమ్యాన్నే ఛేదించే... స్థైర్యంతో పద.. ధైర్యాన్నే సంధించేయ్..’ అంటూ సనాపతి భరద్వాజ్ పాత్రుడు రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. స్వీకర్ అగస్తీ కంపోజ్ చేసిన ఈ పాటను సుగుణమ్మ, అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తీ పాడారు. ఫిబ్రవరి 29 న ట్రైలర్ విడుదల కానుంది.