విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘కల్ట్’ (CULT). తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. భారతదేశపు తొలి ఆథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్ ఇది. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తున్నాడు. ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
రక్తపాతం.. డార్క్ కామెడీతో ‘కల్ట్’:
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వీయ డైరెక్ట్ చేసిన ‘కల్ట్’ ట్రైలర్ ట్రెండింగ్లో ఉంది. విడుదలైన కొద్ది సమయంలోనే ట్రైలర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రక్తపాతం, యాక్షన్ సన్నివేశాలు, డార్క్ కామెడీతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు చూస్తుంటే ‘కల్ట్’ హారర్, స్లాషర్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. గోవాలోని ఓ దీవిలో చిక్కుకున్న యువత ప్రాణాల కోసం పోరాడే పరిస్థితులు, హింసాత్మక సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. మరోవైపు విశ్వక్ సేన్ పాత్ర చెప్పే డైలాగులు, డార్క్ కామెడీ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సీన్స్ తీవ్రతను మరింత పెంచుతోంది.
వరుస ఫ్లాపులు .. మళ్లీ నాకోసం నేనే నిలబడ్డా: విశ్వక్ సేన్
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘వరుసగా మూడు ఫ్లాప్‌లు వచ్చినప్పుడు కొంచెం ఒత్తిడికి గురయ్యా. ఆందోళన కూడా కలిగింది. నేనేమైనా తప్పు దారిలో వెళ్తున్నానా? అని అనిపించింది. అలాంటి సమయంలో నా బలమేంటో, నా ఆయుధం నా చేతిలోనే ఉందని మా అన్న గుర్తుచేశారు.
‘ఫలక్‌నుమా దాస్’ సినిమా చేసేటప్పుడు నా కోసం నేనెలా నిలబడ్డానో.. ఇప్పుడు కూడా అలాగే నిలబడాలని అర్థమైంది. అదే నమ్మకంతో ఈ సినిమాను మొదలుపెట్టా. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు తాజుద్దీన్ గారిని డైరెక్ట్ చేయమని అడిగాను. నా యాక్టింగ్ గురువుల్లో ఆయన ఒకరు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆయన చేయలేదు. నాకోసం నేనే నిలబడాలని ఈ సినిమాను డైరెక్ట్ చేశా. ఇందులో దాదాపు 150 మంది ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉన్నారు. నాపై నమ్మకం పెట్టుకున్న వీరందరికీ థ్యాంక్స్. సినిమా చూస్తున్నంతసేపు కొత్త ప్రపంచంలోకి వెళ్తారు’’ అని విశ్వక్ సేన్ చెప్పాడు.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన తారక్ పొన్నప్ప మాట్లాడుతూ ‘ఈ ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో ‘పుష్ప’ చిత్రం ఒకెత్తు అయితే.. ‘కల్ట్’ మరో లెవల్‌లో ఉంటుంది. ఇందులోని డార్క్ కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ఈ చిత్రంలో విశ్వక్ విశ్వరూపం చూస్తారని, అక్టోబర్ 30న సినిమా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత సందీప్ కాకరాల అన్నారు.
