- వ్యవసాయరంగ చరిత్రలో కనివిని ఎరుగని రేట్లు
- రైతుల పొలాల వద్దకొచ్చి కాంటాలు పెడుతున్న వ్యాపారులు
- మిగులుతున్న ధాన్యం రవాణా ఛార్జీలు
- పత్తి క్వింటాల్‌కు రూ. 9,260.. ఆదిలాబాద్ లో రికార్డు స్థాయిలో ధర
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
వరంగల్, వెలుగు : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో అన్ని రంగాలు కుదేలవుతుండగా సన్న వడ్లు పండించిన రైతులకు మాత్రం తాత్కాలిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రస్తుతం ఓరుగల్లులో క్వింటాల్సన్న వడ్లకు రూ.4 వేలు పలుకుతూ రికార్డు ధరలు నమోదవుతున్నాయి.
వందల ఏండ్ల వ్యవసాయరంగ చరిత్రలో ఏనాడులేని విధంగా వరి ధాన్యానికి మస్త్డిమాండ్ రావడంతో రైతులు సంబురపడుతున్నారు. మిషీన్ తీసుకొచ్చి కోతలు మొదలు పెట్టకముందే పంట అమ్ముడుపోతోంది. వడ్లను గోదాములు, కొనుగోలు సెంటర్ల వద్దకు తీసుకుపోయేందుకు ట్రాక్టర్లు, డీసీఎం వాహనాలకు పెట్టే వేలాది రూపాయల రవాణా ఛార్జీలు మిగులుతున్నాయి.
ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద నిద్రల్లేని పడిగాపులు దూరమయ్యాయి. అకాల వానల నుంచి పంటను కాపాడుకోడానికి ప్లాస్టిక్ కవర్లు కొనే బాధ తప్పింది. ధాన్యం విక్రయించాక రావాల్సిన డబ్బుల కోసం బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకునే లొల్లి లేకుండా పోయింది. వడ్లు మేలురకంగా ఉన్నాయంటే చాలు.. వ్యాపారులు వెంటనే రైతన్నల వద్ద క్యూ కడుతున్నారు.
ఎల్‌నినోతో 40 శాతం తగ్గిన వరిసాగు
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వానాకాలం సీజన్లో సాధారణంగా 9 లక్షల ఎకరాల నుంచి 9.50 లక్షల ఎకరాల వరకు వరి సాగు చేస్తున్నారు. కాగా, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు 5.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
అందులోనూ చాలా ప్రాంతంలో బోర్లు సరిగ్గా నడవక ఆశించిన స్ధాయిలో దిగుబడి రాలేదు. దీంతో అందుబాటులో ఉన్న సన్నవడ్ల రకానికి ఊహించని స్థాయిలో ధర పలుకుతోంది. వరి సాగు చేసి పంట చేతికొచ్చిన రైతులు సంతోష పడుతుండగా, మార్కెట్లో పంటకు డిమాండ్ ఉన్న సమయంలో పంట దక్కని రైతులు ఆవేదన చెందుతున్నారు.
డబుల్ రేట్..
ఉమ్మడి వరంగల్‌తో పాటు చాలా జిల్లాల్లో గ్రేడ్–ఏ సన్నరకం వడ్లకు క్వింటాల్ రూ.4 వేల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన గతేడాది ధరలతో పోలీస్తే ఈసారి పంటకు డబుల్ రేట్లు కలిసివస్తున్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వ మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్ రూ.2,369 ఉండగా, గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.2,389 చొప్పున ప్రకటించారు. తీరా మార్కెట్ వెళ్లాక కొర్రీలు పెట్టి క్వింటాల్ ధర రూ.1,900 నుంచి రూ.2వేలు మాత్రమే కట్టించారు.
కాగా, ప్రస్తుతం అదే పంటకు మార్కెట్లో డబుల్ రేట్‌కు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం గ్రేడ్–ఏ సన్నరకం వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ రూ.2,461గా నిర్ణయించింది. ఈ లెక్కన దళారుల కొర్రీల అనంతరం క్వింటాల్ ధర రూ.2 వేలు వస్తుందని రైతులు భావించగా, మార్కెట్లో అనూహ్యంగా క్వింటాల్ రూ.4 వేల ధరలు పలుకుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 7 రకాల సన్నవడ్లకు అదనంగా ఒక్కో క్వింటాల్‌పై రూ.500 బోనస్ లెక్కలు వేసినా ఒక్కో క్వింటాల్‌పై రూ.1500 అదనంగా
కలిసివస్తోంది.
వాహనాల లొల్లి లేదు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో కష్టకాలంలో దిగుబడి వచ్చిన రైతులకు నాలుగు పైసలు కలిసివచ్చేలా చేయడానికితోడు మార్కెట్ కష్టాలు లేకుండాచేసింది. ఇప్పటివరకు రైతులు పంట కోతలు మొదలుపెట్టిన నుంచి దానిని ట్రాక్టర్లు, డీసీఎంల ద్వారా మార్కెట్ తరలించడానికి నానా ఇక్కట్లు పడేది.
ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ల వద్ద కుప్పపోసి వర్షం భయంతో ఆకాశం వైపు చూడాల్సి వచ్చేది. కాంటా పెట్టడానికి సీరియల్ నంబర్ రావడం కోసం రోజుల తరబడి వడ్లమీదనే కునుకు తీసేది. కాగా, ఈసారి పంట కోతలు కాకముందే వ్యాపారులు పొలాల వద్దకొచ్చి సరైన ధరలు, కాంటాలతో రెడీ ఉండటానికితోడు వెంటనే పంట కొనుగోలు డబ్బులు అందిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గత మూడేండ్లలో తొలిసారిగా పత్తికొనుగోళ్ల ప్రారంభం రోజే రికార్డు స్థాయిలో క్వింటాల్పత్తికి రూ. 9,260 ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కలెక్టర్ రాజర్షి షా పూజలు నిర్వహించి కొనుగోళ్లకు వేలం పాట నిర్వహించారు.
సీసీఐ మద్దతు ధర రూ. 8867 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.9,260కి వేలం పాడారు. అనంతరం పత్తి తేమ శాతం పరీక్ష, తూకం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లుల్లో 18 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైతులు పత్తిలో తేమ శాతం అధికంగా ఉండకుండా చూసుకోవాలని, నాణ్యమైన పత్తి తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.
