గ్రేటర్ వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్ సెంటర్ జోన్ పాయింట్ వద్ద పైపులైన్ లీకేజీ కారణంగా గత నెల రోజులుగా వందలాది కుటుంబాలకు సరిపడే తాగునీరు మురుగు నాలాలో కలుస్తూ వృథా అవుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నీటిని పొదుపు చేయాలని, వృథా చేస్తే భారీ జరిమానాలు విధిస్తామని ప్రచారం చేస్తుంటే, ఇక్కడ మాత్రం అధికారుల నిర్లక్ష్యం, పంపింగ్ లో వైఫల్యం కారణంగా నీళ్లు వృథాగాపోతున్నాయి. కొంతమంది డీఈలు, ఏఈలు, లైన్మెన్లు, పంపు ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా రాత్రి వేళల్లో రిజర్వాయర్లు నిండిపోయి గంటల తరబడి నీరు వృథాగా పోతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
