వాట్సాప్‌లో మీ నెంబర్ ఇతరులకు కనిపించకుండా దాచేసే ఒక సరికొత్త ప్రైవసీ ఫీచర్ వచ్చేసింది. ఇకపై కొత్త వారితో లేదా గ్రూప్ చాట్లలో మాట్లాడేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన పనే లేదు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లాగే వాట్సాప్‌లో కూడా మీకోసం ఒక ప్రత్యేకమైన యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, వెతకాలన్నా మీ నెంబర్ అడగకుండా ఈ పేరుతోనే ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు.
అకౌంట్ ప్రైవసీ కోసం మీ నెంబర్ బ్యాక్‌గ్రౌండ్‌లో లింక్ అయి ఉంటుంది. కానీ వేరే వాళ్లకి మాత్రం అస్సలు కనిపించదు. ఈ పేరును మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అలా మార్చడం వల్ల మీ పాత మెసేజ్‌లు గానీ, అకౌంట్ వివరాలు గానీ ఏమాత్రం డిలీట్ అవ్వవు. ఈ పేరు పెట్టడానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవేంటంటే.. మీ పేరు మూడు నుంచి ముప్పై ఐదు అక్షరాలలోపు ఉండాలి. అందులో కనీసం ఒక స్మాల్ లెటర్ ఉండాలి. కావాలంటే నెంబర్లు కూడా వాడుకోవచ్చు. అయితే వెబ్ సైట్ అడ్రస్లలాగా డాట్ కామ్ వంటి పదాలు పేరు మొదట్లో కానీ చివర్లో కానీ అస్సలు పెట్టకూడదు.
ఈ ఫీచర్ ఆన్ చేసుకోవాలంటే.. ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే పైన కుడి వైపున ఉండే మూడు చుక్కల మీద నొక్కి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అదే ఐఫోన్ అయితే స్క్రీన్ కింద ఉండే సెట్టింగ్స్ గుర్తును నొక్కండి. అప్పుడు పేజీ పైన కనిపించే మీ ప్రొఫైల్ పేరు మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు యూజర్ నేమ్ అనే ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది.. దాన్ని ఎంచుకోండి. ఇప్పుడు మీ మనసుకు నచ్చిన ఒక మంచి పేరును అక్కడ టైప్ చేయాలి. మీరు పెట్టిన పేరు ఖాళీగా ఉందో లేదో వాట్సాప్ వెంటనే చెక్ చేసి మీకు కేటాయిస్తుంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ వద్దు అనుకుంటే ఎప్పటిలాగే నెంబర్‌తో కూడా వాడుకోవచ్చు.
అసలు కంటెంట్ చూడాలంటే..
వాట్సాప్ చాటింగ్‌ను మరింత మెరుగుపరచనుంది. ఇకపై గ్రూప్ చాట్లలో మీరు పంపే మెసేజ్లోని ముఖ్యమైన విషయాలను ఇతరులు నేరుగా అస్సలు చూడలేరు. మీరు ఏదైనా గుట్టుగా చెప్పాలనుకున్నప్పుడు ఆ సమాచారం బ్లర్‌గా కనిపిస్తుంది. అవతలి వ్యక్తి ఆ మెసేజ్ మీద వేలితో నొక్కితే కానీ లోపల ఉన్న అసలు కంటెంట్ బయటపడదు.
ముఖ్యంగా కొత్త సినిమాలు, ఆటల రిజల్ట్స్ లాంటి ఎగ్జయిటింగ్ విషయాలను ముందే చెప్పేసి పాడు చేయకుండా, అవతలి వారిలో కుతూహలం పెంచడానికి ఇది సూపర్‌గా పనిచేస్తుంది. ఇది కేవలం రాసే ముచ్చట్లకే కాకుండా ఫొటోలు, వీడియోలకు కూడా వర్తించేలా వాట్సాప్ ముస్తాబు చేస్తోంది. దీంతోపాటే చదివిన వెంటనే మెసేజ్ మాయమైపోయే మరో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్ కూడా తోడుకానుంది.
ఇందులో మనకు నచ్చిన విధంగా ఐదు నిమిషాలు, ఒక గంట లేదా పన్నెండు గంటల టైమర్ సెట్ చేసుకోవచ్చు. మనం పెట్టిన టైం ప్రకారం అవతలి వ్యక్తి ఆ మెసేజ్ చూడగానే అది మాయమైపోతుంది. ఒకవేళ వాళ్లు ఆ మెసేజ్ చూడకుండా అలాగే వదిలేసినా కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత అది దానంతట అదే మాయమవుతుంది. ప్రస్తుతం ఇవన్నీ డెవలపింగ్ స్టేజీలోనే ఉన్నాయి, రాబోయే కొద్ది రోజుల్లో మన ఫోన్లలోకి వచ్చేస్తాయి.
