టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఇద్దరు యంగ్ హీరోలు!

టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఇద్దరు యంగ్ హీరోలు!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు  మోగనున్నాయా? అవుననే టాక్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఒకరు నిశ్చితార్థానికి సిద్ధమవుతుండగా, మరొకరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా 'హనుమాన్','మిరాయ్' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

పెళ్లి భాజాలు

బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇప్పుడు వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 'హనుమాన్', 'మిరాయ్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ యంగ్ హీరోప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తేజ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

డిసెంబర్‌లో పెళ్లి?

సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. నవంబర్‌లో ఆయన నిశ్చితార్థం జరగనుందట. డిసెంబర్‌లో ఉదయ్‌పూర్ వేదికగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించనున్నారని సమాచారం.  తేజ సజ్జా చేసుకోబోయే అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత? ఆయన ప్రేమ వివాహం చేసుకోబోతున్నారా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత లేదు.

సాయిధరమ్ తేజ్ పెళ్లి వార్తలపై ఆసక్తి

మెగా మేనల్లుడు, 'విరూపాక్ష' హిట్ కాంబో హీరో సాయిధరమ్ తేజ్ కూడా త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. తన చిన్ననాటి స్నేహితురాలిని ఆయన వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కాబోయే వధువు వివరాలు, పెళ్లి తేదీపై స్పష్టత లేదు. వీటిపై అధికారిక సమాచారం వెలువడితేనే నిజానిజాలు తేలనున్నాయి.  

ప్రస్తుతం తేజ సజ్జా ‘మిరాయ్ 2’, ‘జాంబిరెడ్డి 2’ చిత్రాలతో బిజీగా ఉండగా, సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు హీరోల పెళ్లి వార్తల్లో నిజమెంత? అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది..