టెక్నాలజీ ప్రపంచంలో కొత్త ట్రెండ్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. అలా ఇప్పుడు సైబర్‌డెక్కింగ్ అనే ట్రెండ్ జనరేషన్ జెడ్‌ను బాగా ఆకట్టుకుంటోంది. టెక్ కమ్యూనిటీల్లో సైబర్‌డెక్కింగ్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఎంత స్టైలిష్‌గా కనిపించినా, అందరికీ ప్రాక్టికల్ ఆప్షన్ కాదని టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఇంతకీ సైబర్‌డెక్కింగ్ అంటే ఏంటి?
సైబర్‌డెక్ అంటే మన అవసరాలకు తగ్గట్టు డిజైన్ చేసుకునే కస్టమ్ కంప్యూటింగ్ డివైజ్. చిన్న స్క్రీన్, మినీ కీబోర్డ్ వంటి సింగిల్-బోర్డ్ కంప్యూటర్లు, బ్యాటరీ ప్యాక్‌లు, యాంటెనాలు, సెన్సర్లు కలిపి తయారుచేసే ఈ డివైజ్‌లు సైన్స్ ఫిక్షన్ మూవీస్‌లో కనిపించే ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్‌లను గుర్తుకు తెస్తాయి.
‘సైబర్‌పంక్’ కల్చర్ ప్రభావంతో పుట్టిన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు యూత్‌లో క్రియేటివ్ హాబీగా మారిపోయింది. రెడీమేడ్ ల్యాప్‌టాప్ కొనడం కంటే, తమ ఆలోచనలకు తగ్గట్టు ఒక డివైజ్‌ను సొంతగా
తయారుచేసుకోవడం వారికి థ్రిల్ ఇస్తోంది. టెక్నాలజీ గురించి ఇంకాస్త ఎక్కువగా తెలుసుకోవడం, హార్డ్‌వేర్ ఎలా పనిచేస్తుందో.. అర్థం చేసుకోవడం, తమ క్రియేటివిటీని ప్రదర్శించడం వంటి అంశాలు ఈ ట్రెండ్‌కు పాపులారిటీ తెచ్చిపెడుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సైబర్‌డెక్‌లు నిజంగానే ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొందరు పాత బ్రీఫ్‌కేస్‌లలో కంప్యూటర్ అమర్చి తీసుకెళ్తుంటారు. చిన్న బ్యాక్ ప్యాక్‌లోనే పూర్తి వర్క్‌స్టేషన్ సెట్ చేస్తారు. సోలార్ పవర్‌తో పనిచేసేలా డిజైన్ చేస్తారు. కొంతమంది రేడియో కమ్యూనికేషన్, హ్యాకింగ్ ల్యాబ్, ఫీల్డ్ రీసెర్చ్ వంటి అవసరాలకు తగ్గట్టు సైబర్‌డెక్‌లను తయారుచేస్తున్నారు. ఇదే ఈ ట్రెండ్ ప్రత్యేకత.
అయితే రోజువారీ పనుల కోసం సైబర్‌డెక్‌లు బెస్ట్ ఆప్షన్స్ కావు. అడ్వాన్స్డ్ల్యాప్టాప్లు అందించే స్పీడ్, బ్యాటరీ లైఫ్, కంఫర్ట్.. ఇవి అందించలేకపోవచ్చు. చిన్న స్క్రీన్‌పై గంటల తరబడి పని చేయడం కష్టం. మినీ కీబోర్డ్‌పై టైపింగ్ చేయడం అసౌకర్యంగా ఉంటుంది. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, హెవీ సాఫ్ట్‌వేర్ టాస్క్‌లు చేయాలంటే కుదరదు. ఖర్చు విషయంలోనూ చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది సైబర్‌డెక్‌ను తక్కువ డబ్బుతో తయారు చేసుకోవచ్చని అనుకుంటారు.
కానీ విడి భాగాలు కొనడం, వాటిని అసెంబుల్ చేయడం, కస్టమ్ కేసులు తయారుచేయించడం, పవర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వంటివన్నీ సరిగా చేయాలంటే ఖర్చు బాగా పెరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో మంచి బ్రాండెడ్ ల్యాప్‌టాప్ ధరతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ కూడా ఖర్చవుతుంది.
సైబర్‌డెక్‌లు తయారుచేయాలంటే ఎలక్ట్రానిక్స్, వైరింగ్, కోడింగ్, హార్డ్‌వేర్ అసెంబుల్పై అవగాహన ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు సమస్యలను సొంతగా సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి ఇది టెక్ మేకర్స్, డెవలపర్లకు సూట్ అవుతుంది. అయినా సైబర్‌డెక్కింగ్‌ను కేవలం ఫ్యాషన్ ట్రెండ్‌గా కొట్టిపారేయలేం. ఇది యూత్‌లో క్రియేటివిటీని పెంచుతుంది. సిస్టమ్‌లు ఎలా పనిచేస్తాయో నేర్పిస్తుంది. కొత్త ప్రయోగాలు చేయాలనే ఉత్సాహాన్ని పెంచుతుంది. రోబోటిక్స్ లవర్స్, హార్డ్‌వేర్ డెవలపర్లు, మేకర్ కమ్యూనిటీ మెంబర్స్‌కు ఇది అమేజింగ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్.
