న్యూఢిల్లీ, వెలుగు: ఎన్నికల ప్రక్రియ, ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్, సీజేపీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. న్యాయస్థానాలు, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కేవలం అధికారం కోసమే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతృత్వంలో అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 5 వరకు దేశవ్యాప్తంగా ‘లోక్ తంత్ర్ బచావో-భీడ్ తంత్ర్ హటావో’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రధాన నగరాల్లో సభలు, విద్యావంతులు, మేధావులతో చింతన్ సంవాద్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 మందితో సమావేశాలు నిర్వహించి విపక్షాల విమర్శలను తిప్పికొడతామన్నారు. వాస్తవాల ఆధారంగా ఎవరైనా విమర్శలు చేయవచ్చని, నిరసనల పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆధారరహిత ఆరోపణలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
