ఇండియన్ ఫ్యాన్స్కి పూనకాలే.. రోహిత్, కోహ్లీ ఎంట్రీ డేట్ ఫిక్స్.. అప్పుడే ప్రాక్టీస్ షురూ

ఇండియన్ ఫ్యాన్స్కి పూనకాలే.. రోహిత్, కోహ్లీ ఎంట్రీ డేట్ ఫిక్స్.. అప్పుడే ప్రాక్టీస్ షురూ

IND vs AFG: ఐపీఎల్ 2026 హంగామా ముగియడంతో భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది. జూన్ 9 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా ఈ ఇద్దరూ నెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయనున్నారు. భారత్, ఆఫ్ఘన్ జట్ల మధ్య జూన్ 6 నుంచి ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ పోరు ముగియగానే వన్డే సిరీస్ ప్రారంభమైతుంది. హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీ జూన్ 9న ముల్లాన్‌పూర్‌కి చేరుకుని.. జూన్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు వీరు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయనున్నారు. అనంతరం జూన్ 13న ధర్మశాలలో జరిగే ఫస్ట్ వన్డే కోసం జట్టుతో కలిసి అక్కడికి వెళ్లనున్నారు.  

2027 వరల్డ్ కప్ టార్గెట్: 
ఈ వన్డే సిరీస్ 2027 వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా టీమిండియా భావిస్తోంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో తృటిలో చేజారిన టైటిల్‌ను ఈసారి ఎలాగైనా అందుకోవాలనే కసితో రోహిత్, కోహ్లీ ఉన్నారు. తమ కెరీర్ చివరి దశలో ఉండటంతో ఈ ఇద్దరు, తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను కాపాడుకోవడానికి ఈ సిరీస్‌ను కీలకంగా భావిస్తున్నారు.

ఆరుగురు నెట్ బౌలర్లతో టీమిండియా: 
ఈ ప్రాక్టీస్ సెషన్స్ కోసం బీసీసీఐ ఏకంగా ఆరుగురు నెట్ బౌలర్లను సెలక్ట్ చేసింది. ఇందులో ఐపీఎల్ 2026లో తన వేగంతో అదరగొట్టిన మయాంక్ యాదవ్ సైతం ఉన్నాడు. ఆఫ్ఘన్ బ్యాటర్లను ఎదుర్కోవడానికి మన బ్యాటర్లకు మయాంక్ లాంటి స్పీడ్‌స్టర్లు సాయపడనున్నారు. ఇప్పటికే వన్డే జట్టులోకి ఎంపికైన ప్రిన్స్ యాదవ్ కూడా రోహిత్, కోహ్లీలతో కలిసి ధర్మశాలకు వెళ్లనున్నాడు.  

కసి మీదున్న కింగ్ కోహ్లీ, రోహిత్: 
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలో కోహ్లీ కీ రోల్ పోషించాడు. టోర్నమెంట్ లో 675 రన్స్ చేసి సూపర్ ఫామ్‌లో ఉండగా.. మరోవైపు రోహిత్ శర్మ ఐపీఎల్లో ఈసారి ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. రోహిత్ కేవలం 9 ఇన్నింగ్స్‌లలో 283 పరుగులు చేశాడు. కేకేఆర్, లక్నోలపై ఆడిన రెండు ఇన్నింగ్స్‌లు మినహా మిగతా మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఐపీఎల్ లోని ఓటముల కసిని ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్‌లో చూపించాలని హిట్ మ్యాన్ పట్టుదలతో ఉన్నాడు.