వేసవిలో ACలు ఎందుకు పేలిపోతుంటాయ్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వేసవిలో ACలు ఎందుకు పేలిపోతుంటాయ్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వేసవిలో ఎండవేడి నుంచి ఉపశమనం ఇచ్చే ఏసీలు, అప్పుడప్పుడు ప్రాణాంతక బాంబుల్లా మారుతున్నాయి. ఇటీవల నగరాల్లో ఏసీలు పేలిపోతున్న ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? నిపుణులు చెబుతున్న కారణాలేంటి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఏసీలు పేలిపోవడానికి ప్రధాన కారణం ఓవర్ హీటింగ్. వేసవిలో బయట ఉష్ణోగ్రతలు 45-50 డిగ్రీలకు చేరుకున్నప్పుడు.. ఏసీ కంప్రెసర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనికి తోడు ఏసీని గంటల తరబడి విరామం లేకుండా వాడటం వల్ల లోపలి భాగాలు వేడెక్కి మంటలు చెలరేగుతాయి. ముఖ్యంగా అవుట్ డోర్ యూనిట్లను గాలి ఆడని ఇరుకైన ప్రదేశాల్లో అమర్చినప్పుడు, అక్కడి వేడి గాలి బయటకు వెళ్లలేక కంప్రెసర్ పేలిపోయే ప్రమాదం ఉంది. మరో కీలకమైన అంశం రెఫ్రిజిరెంట్ గ్యాస్ లీకేజీ. ఏసీలో ఉండే గ్యాస్ లీక్ అయినప్పుడు, అది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చే చిన్న స్పార్క్‌తో కలిస్తే భారీ పేలుడు సంభవిస్తుంది.

విద్యుత్ లోపాలు కూడా ఏసీల ప్రమాదాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. నాసిరకం వైరింగ్ వాడటం, లూజ్ కనెక్షన్లు ఉండటం లేదా ఏసీ ప్లగ్ పాయింట్ వద్ద ఇతర భారీ విద్యుత్ పరికరాలను కనెక్ట్ చేయడం వల్ల ఓవర్ లోడ్ అయి వైర్లు కాలిపోతాయి. ఓల్టేజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్టెబిలైజర్ వాడకపోతే, ఇంటర్నల్ సర్క్యూట్ బోర్డులు దెబ్బతిని ప్రమాదాలకు దారితీస్తాయి. అలాగే ఏసీని సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల ఫిల్టర్లలో ధూళి పేరుకుపోయి ఎయిర్ ఫ్లో తగ్గుతుంది. దీనివల్ల సిస్టమ్ కష్టపడి పనిచేయాల్సి వచ్చి కంప్రెసర్ వేడెక్కుతుంది.

ప్రమాదం జరగడానికి ముందు ఏసీ కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని గమనిస్తే పెను ప్రమాదాలను అరికట్టవచ్చు. ఏసీ నుండి వింత శబ్దాలు రావడం, ఏదైనా కాలిన వాసన రావడం, గది సరిగ్గా చల్లబడకపోవడం, ఏసీ వేసిన వెంటనే సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అవ్వడం వంటివి జరిగితే వెంటనే అప్రమత్తం కావాలి. ఇండోర్ లేదా అవుట్ డోర్ యూనిట్ల నుండి గాలి లీక్ అవుతున్న శబ్దం వస్తే అది గ్యాస్ లీకేజీకి సంకేతం. ఇలాంటి సమయాల్లో ఏసీని వెంటనే ఆపేసి టెక్నీషియన్‌ను పిలవాలి.

నివారణా చర్యల విషయానికి వస్తే.. ఏసీని నిరంతరాయంగా వాడకుండా మధ్యలో కొద్దిసేపు గ్యాప్ ఇవ్వాలి. రాత్రిపూట టైమర్ లేదా స్లీప్ మోడ్ సెట్ చేసుకోవడం వల్ల కంప్రెసర్ మీద లోడ్ తగ్గుతుంది. ప్రతి ఏడాది కనీసం రెండుసార్లు ప్రొఫెషనల్ టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించాలి. వైరింగ్ నాణ్యతను తనిఖీ చేయించుకోవాలి. అవుట్ డోర్ యూనిట్ చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండేలా చూసుకోవాలి. పొగ లేదా మంటలు కనిపిస్తే.. ఏసీని ఆపడమే కాకుండా మెయిన్ పవర్ సప్లైని కూడా డిస్‌కనెక్ట్ చేయాలి. చిన్నపాటి నిర్లక్ష్యం భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుందని గుర్తించి, ముందస్తు జాగ్రత్తలు పాటించడం బెటర్. ఇలా ఏసీని తనిఖీ చేసుకుంటూ వాడుకుంటుంటే పెద్ద ప్రమాదాలను జరగక మునుపే అరికట్టవచ్చు.