గుజరాత్‌లోని టెక్స్టైల్స్, డైమండ్ ఇండస్ట్రీలకు కేంద్రమైన సూరత్‌లో ప్రస్తుతం తీవ్ర వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి పయనం అవుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైల్వే స్టేషన్లలో కిటకిటలాడుతున్న జనాలను చూసి కొందరు దీనిని "సామూహిక వలసగా" అభివర్ణిస్తున్నారు. మరికొందరు దీన్ని పండుగ సీజన్ రద్దీ అంటూ కొట్టిపారేస్తున్నారు. అసలు సూరత్‌లో నిజంగా ఏం జరుగుతోంది? కార్మికులు వెళ్లిపోవటం వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకుందాం రండి..
గావ్ చలో ఆందోళన్:
ఈ మొత్తం పరిణామాల కేంద్రంలో 'గావ్ చలో ఆందోళన్' ఉంది. అంటే స్వగ్రామాలకు తిరిగి వెళ్లండి అని దీనికి అర్థం. సూరత్‌లోని టెక్స్టైల్, ఎంబ్రాయిడరీ యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. కార్మికులతో రోజుకు 12 గంటలకు పైగా పని చేయించుకోవడం, వీకెండ్ సెలవులు ఇవ్వకపోవడం, అదేంటని ప్రశ్నిస్తే జీతాలు కట్ చేయటం, ఉద్యోగాల నుంచి తొలగించడం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
శ్రమ దోపిడీని నిరసిస్తూ, చట్టబద్ధమైన కార్మిక హక్కులను డిమాండ్ చేస్తున్నారు. చట్టప్రకారం తమకు రోజుకు 8 గంటల పనివేళలు, ఆదివారం పెయిడ్ సెలవు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. డిమాండ్లు నెరవేరకపోతే కనీసం 2 నెలలు తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లిపోవాలని కార్మిక ప్రతినిధి అజయ్ దూబే పిలుపునిచ్చారు. దీని ప్రభావంతో ఇప్పుడు అక్కడి రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.
Biharis kicked out of Gujarat Almost 100000 https://t.co/VVBS0tW0et
— दक्षिणपथाधीश (𑘟𑘎𑘿𑘬𑘱𑘜𑘿𑘢𑘞𑘰𑘠𑘲𑘫) (@bornauthority) October 11, 2026
పండుగ ప్రయాణమా? బలవంతపు వలసలా?
సుమారు 10 లక్షల మంది కార్మికులు సూరత్ వదిలి వెళుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే పరిశ్రమ వర్గాలు, గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ వాదనలో పూర్తి నిజం లేదు. ఏటా దీపావళి, ఛత్ పూజ పండుగల సమయాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు తమ కుటుంబాలను కలుసుకోవడానికి సొంతూళ్లకు వెళ్లడం సాధారణ ఆనవాయితీ అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది కార్మిక వివాదాలు, ఆందోళనల నేపథ్యంలో కొందరు ముందుగానే ప్రయాణమైనప్పటికీ.. స్టేషన్లలో కనిపిస్తున్న రద్దీ అంతా కేవలం పండుగ ప్రయాణమేనని స్థానిక పరిశ్రమ నిపుణులు, యజమానులు చెబుతున్నారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతూనే.. మరోవైపు పండుగలకు వెళ్లడం రెండూ సమాంతరంగా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
భవిష్యత్తు సవాళ్లు - పరిశ్రమపై ప్రభావం:
సూరత్ టెక్స్టైల్ పరిశ్రమ పూర్తిగా వలస కార్మికులపైనే ఆధారపడి ఉంది. కార్మికులు ముందస్తుగా వెళ్లిపోవడం వల్ల ఉత్పత్తిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే పండుగ ముగిసిన తర్వాత కార్మికులు తిరిగిర వస్తారా? లేక తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదంటారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.
ఈ సంక్షోభానికి తెరపడాలంటే యజమానులు, కార్మిక సంఘాలు, కార్మిక శాఖ సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది. పండుగ అనంతరం కార్మికులు తిరిగి ఫ్యాక్టరీల్లో పనుల్లో చేరితే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది.. లేదంటే సూరత్ పరిశ్రమకు ఇది దీర్ఘకాలిక తలనొప్పిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
