వెలుగు స్పెషల్: లోకాయుక్త ఉచిత న్యాయంపై భరోసా ఏది?

వెలుగు స్పెషల్: లోకాయుక్త ఉచిత న్యాయంపై  భరోసా ఏది?

తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త ఏర్పడి ఆరేళ్లు పూర్తయినా నేటికీ నిరుపేద ప్రజలకు ఉచిత న్యాయం అందని ద్రాక్షగా మారుతోంది.  అవినీతి, అధికార దుర్వినియోగం అరికట్టేందుకు  ప్రజల చేతిలో సమర్థవంతమైన ఆయుధంగా ఉండాల్సిన  తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తలో న్యాయంకోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని  వివిధ జిల్లాల  ప్రజలు తమ భూముల సమస్యలు,  ప్రభుత్వ పథకాల్లో జాప్యం,  రెవెన్యూ రికార్డుల మార్పు, దౌర్జన్యం,  ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ శాఖల అధికారుల అధికార దుర్వినియోగం  తదితర  ఫిర్యాదులతో లోకాయుక్తను ఆశ్రయిస్తున్న నిరుపేద, మధ్యతరగతివారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

కానీ లోకాయుక్తలో గత కేసులను పరిశీలిస్తే 2022లో 5,254 కేసులు పరిష్కారానికి అందుబాటులో ఉండగా 1,663 మాత్రమే డిస్పోజ్ అయ్యాయి.  అంటే అందుబాటులో ఉన్న కేసుల్లో సుమారు 31.6%  మాత్రమే ఆ ఏడాది డిస్పోజ్ అయ్యాయి. సంవత్సరం చివరికి 3,591 కేసులు మిగిలాయి.  2023లో పరిస్థితి పెద్దగా మారలేదు. 5,121 కేసులు అందుబాటులో ఉండగా 1,516 కేసులు మాత్రమే డిస్పోజ్ అయ్యాయి.  

సుమారు 29.6%. పెండింగ్ సంఖ్య 3,605కు పెరిగింది. 2024లో మాత్రం  డిస్పోజల్‌‌లో  గణనీయమైన పెరుగుదల కనిపించింది.  5,079 కేసుల్లో 1,976 కేసులు డిస్పోజ్ అయ్యాయి, అంటే సుమారు 38.9%. ఫలితంగా పెండింగ్ 3,103కు తగ్గింది.  2024లో పనితీరు మెరుగుపడినప్పటికీ, మూడు సంవత్సరాల చివర్లో కూడా 3,103 ఫిర్యాదులు పెండింగ్‌‌లోనే ఉన్నాయి. ఇంకా 2025, 2026 అక్టోబర్ నెల నాటికి ఈ పెండింగ్ కేసుల సంఖ్యను గమనిస్తే భారీగా పెండింగ్‌‌లోనే ఉండొచ్చు.  ఎందుకంటే  పూర్తిస్థాయి సమాచారం లోకాయుక్త అధికారిక  వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో లేకపోవడం మనం గమనించవచ్చు.

లోకాయుక్తలో డిస్పోజ్ అయిన కేసులను ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో వారి ఫిర్యాదులకు  న్యాయం జరిగిన  కేసులు కొద్ది మాత్రమే ఉండగా వివిధ కారణాలతో డిస్పోజ్ అయిన కేసులు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. న్యాయంకోసం లోకాయుక్తను ఆశ్రయించేవారికి ఎంతో సహనం ఉండాల్సి వస్తుంది. కేసు వివరాలు, స్టేటస్ ఇతర సందేహాలు తెలుసుకోవాలన్నా కేవలం ఒకే ఒక్క ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్  మాత్రమే ఉండడం గమనార్హం. అది కూడా నెలలో ఎప్పుడు పనిచేస్తుందో తెలియదు. ప్రజలకు వీలైనంత త్వరగా న్యాయం 
జరగాలంటే లోకాయుక్త  పనితీరుపై ప్రభుత్వ యంత్రాగం ప్రత్యేక దృష్టి సారించి తగిన 
సదుపాయాలు కల్పించాలి.  

- ఆడెం ఆంజనేయులు యాదవ్