‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంతో ఆకట్టుకున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి సెట్ అయింది. గత కొన్ని నెలలుగా ఊరిస్తూ వస్తున్న మేకర్స్.. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. దానికితోడు నిర్మాత నాగవంశీ పోస్టర్‌పై ‘‘Born in the North.. Raised in the Centre.. Worshipped in the South’’ అనే ట్యాగ్‌లైన్ వివాదానికి దారితీసింది. ఈ పదాలు తమిళ ప్రజల్లోని ఒక వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలకు కారణమయ్యాయి. తమిళుల ఆరాధ్య దైవంగా భావించే తమిళ్ కడవుల్ మురుగన్ గురించి ఈ ట్యాగ్‌లైన్ తప్పుదారి పట్టించేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే పోస్టర్‌లో సుబ్రహ్మణ్య స్వామి (మురుగన్) వేలాయుధాన్ని పోలిన ఆయుధం కనిపించడం కూడా చర్చకు కారణమైంది. ఏదేమైనా మేకర్స్ మౌనాన్ని పాటిస్తూ.. తాము చెప్పాలనుకున్న కథను చెప్పడానికి షూటింగ్కి సిద్ధమవుతున్నారు.
రుద్రప్రయాగ ఎందుకు?
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఉత్తరాఖండ్‌లోని పవిత్ర క్షేత్రం రుద్రప్రయాగలో జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. రుద్రప్రయాగ హిమాలయాల ఒడిలో ఉన్న అత్యంత ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఒకటి. అలకనంద, మందాకిని నదుల సంగమంగా పేరొందిన ఈ ప్రాంతానికి శివుడితో పాటు కార్తికేయ స్వామితోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడే ప్రసిద్ధ కార్తికేయ స్వామి ఆలయం ఉండటంతో ఈ లొకేషన్ ఎంపిక సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
సినిమా పోస్టర్‌లో శివుని త్రిశూలం, కుమారస్వామి శక్తి ఆయుధాన్ని పోలిన ప్రతీకలు కనిపించడం, ‘‘శివుని కుమారుడు.. పార్వతీదేవికి గర్వకారణం.. సనాతన దళపతి’’ అనే క్యాప్షన్ ఉండటంతో కథకు పురాణ నేపథ్యం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రుద్రప్రయాగ వంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో షూటింగ్ ప్రారంభించడం కథతో ముడిపడి ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
The Son of Shiva.
— Jr NTR (@tarak9999) June 29, 2026
The Pride of Parvathi.
The Eternal Commander.
And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu
త్రివిక్రమ్ సహజసిద్ధమైన లొకేషన్లలో చిత్రీకరణకు ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే. అందుకే సెట్ల కంటే వాస్తవిక వాతావరణం ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటారని, హిమాలయాల అందాలు సినిమా విజువల్స్‌కు మరింత ప్రత్యేకత తీసుకొస్తాయని సమాచారం. అయితే చిత్రబృందం ఇప్పటివరకు రుద్రప్రయాగలో షూటింగ్‌పై అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఆ షెడ్యూల్ పూర్తైన తర్వాత త్రివిక్రమ్ సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రుద్రప్రయాగ ప్రత్యేకత ఏంటి:
రుద్రప్రయాగ అనేది మన ఇండియాలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది హిందువుల ఐదు పవిత్ర నదీ సంగమాలలో (పంచ ప్రయాగలలో) ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. రుద్రప్రయాగ వద్ద అలకనంద మరియు మందాకిని నదులు ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఈ నేపథ్యంలో ‘సంగమ స్థానం’ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా శివుడి మరొక రూపమైన ‘రుద్రుడి’ పేరు మీదుగా ఈ ఊరికి ‘రుద్రప్రయాగ’ అనే పేరు వచ్చింది. అలాగే, ఇక్కడే ప్రసిద్ధ కార్తికేయ స్వామి దేవాలయం ఉండటం ఈ షూటింగ్‌కు ఒక ప్రత్యేకతను చేకూరుస్తోంది.
పోస్టర్లో ఆసక్తి పెంచిన అంశాలు..
‘‘శివుని కుమారుడు, పార్వతీదేవికి గర్వకారణం, సనాతన దళపతి’ అనే క్యాప్షన్‌తో ఎన్టీఆర్ ఈ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో మండుతున్న యుద్ధభూమి, చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాల వెనుక పురాతన దేవాలయాల మధ్య ఆకాశం నుంచి ప్రకాశిస్తున్నట్టుగా శివుడి త్రిశూలం, దాని మధ్య కుమారస్వామి శక్తి ఆయుధం ప్రధానంగా కనిపిస్తున్నాయి.
అయితే శక్తి ఆయుధం చుట్టూ మేఘాల రూపంలో డీఎన్‌ఏ ఆకారం ఉండటం మరింత ఆసక్తి రేపుతోంది. అలాగే పోస్టర్‌పై సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం.. ఒకే ఈటె, ఒకే లక్ష్యం.. ఒకే దైవ తీర్పు అనే ఇంగ్లీష్ కొటేషన్ కనిపిస్తున్నాయి. మనిషి డీఎన్‌ఏకు దైవశక్తికి మధ్యగల విశ్వసృష్టి రహస్యాలను చర్చిస్తూ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతోంది.
ఇందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమా కథకు ప్రాణం పోసేలా ఉంటాయని సినీ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎన్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
