వెలుగు ఓపెన్ పేజీ.. ఓపీఎస్‌‌‌‌‌‌‌‌ పునరుద్ధరించాల్సిందే!

వెలుగు ఓపెన్ పేజీ.. ఓపీఎస్‌‌‌‌‌‌‌‌ పునరుద్ధరించాల్సిందే!

ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ అనేది ఉద్యోగానికి ముగింపు మాత్రమే.  జీవితానికి ముగింపు కాదు.  30–35  సంవత్సరాలు ప్రభుత్వ సేవలో పనిచేసిన ఉద్యోగి, పదవీ విరమణ అనంతరం తన కుటుంబంతో  గౌరవంగా, ప్రశాంతంగా జీవించేందుకు నిరంతర ఆదాయం,  వైద్య భద్రత, కుటుంబానికి ఆర్థిక భరోసా అత్యంత అవసరం.ఈ నేపథ్యంలో అమలులోకి వచ్చిన  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)/ నూతన పెన్షన్ విధానం (ఎన్‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌) వల్ల ఉద్యోగి పదవీ విరమణ భవిష్యత్తు మార్కెట్ పరిస్థితులతో  ముడిపడింది. అందువల్ల  సీపీఎస్‌‌‌‌‌‌‌‌ను  రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్‌‌‌‌‌‌‌‌)ను పునరుద్ధరించాలి.

పెన్షన్ అంటే కేవలం డబ్బు కాదు

ఒక ఉద్యోగి తన జీవితంలో మూడు దశలను ఎదుర్కొంటాడు.  ఉద్యోగ జీవితం,  పదవీ విరమణ, వృద్ధాప్య జీవితం.  ఉద్యోగ కాలంలో జీతం ఉద్యోగికి ఆదాయం ఇస్తుంది.  కానీ పదవీ విరమణ తర్వాత, నెలవారీ కుటుంబ ఖర్చులు ఎవరు భరిస్తారు? - వయస్సు పెరిగేకొద్దీ వచ్చే వైద్య ఖర్చులు ఎలా? - జీవిత భాగస్వామి పరిస్థితి ఏమిటి? - అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పదవీ విరమణ తర్వాత ద్రవ్యోల్బణం పెరిగితే జీవన వ్యయం ఎలా భరించాలి?  ఈ ప్రశ్నలకు సమాధానమే సామాజిక భద్రత కలిగిన పెన్షన్ వ్యవస్థ.

ఓపీఎస్‌‌‌‌‌‌‌‌ ఎందుకు అవసరం?

పాత పెన్షన్ విధానం ఉద్యోగికి పదవీ విరమణ ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత కూడా నెలవారీ పెన్షన్ ద్వారా కుటుంబ జీవనం కొనసాగించగలడు.   ద్రవ్యోల్బణం నుంచి రక్షణ లభిస్తుంది.  ధరలు పెరిగేకొద్దీ పెన్షన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన డీఏ వంటి ప్రయోజనాలు ఉండటం వల్ల వృద్ధాప్యంలో ఆదాయ విలువను కొంతవరకు కాపాడుకోవచ్చు.  ఉద్యోగి మరణించిన తర్వాత అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు కుటుంబ పెన్షన్ వంటి రక్షణ ఉండటం వల్ల కుటుంబం పూర్తిగా ఆదాయ రహితంగా మారకుండా ఉంటుంది.  వృద్ధాప్యంలో ప్రధాన సమస్య వైద్యం. పదవీ విరమణ తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సదుపాయాలు కొనసాగడం కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించగలదు. పిల్లలపై పూర్తిగా ఆధారపడకుండా  సొంత పెన్షన్ ఆదాయంతో జీవించడం  రిటైరైన వృద్ధ ఉద్యోగికి ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. 

ప్రభుత్వం సమగ్ర నిర్ణయం తీసుకోవాలి

సీపీఎస్‌‌‌‌‌‌‌‌పై ఉద్యోగులు చేస్తున్న పోరాటం కేవలం పెన్షన్ కోసం కాదు.  ఇది ఆర్థిక భద్రత కోసం పోరాటం.  పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం కావాలి.   వృద్ధాప్యంలో  వైద్య ఖర్చులతో కుటుంబం ఆర్థికంగా కుప్పకూలకూడదు. తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఉన్న సుమారు 2.60 లక్షల ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సమగ్ర నిర్ణయం తీసుకోవాలి.  ఉద్యోగులు,  ప్రభుత్వం మధ్య చర్చల ద్వారా  సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌‌‌‌‌‌‌‌ పునరుద్ధరించే మార్గాన్ని రూపొందించాలి.  పెన్షన్ అంటే  వృద్ధాప్యానికిచ్చే భరోసా,  కుటుంబానికి రక్షణ, ఆరోగ్యానికి భద్రత,  ఆత్మగౌరవం. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీపీఎస్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్‌‌‌‌‌‌‌‌)ను  పునరుద్ధరించే రాజకీయ నిర్ణయం తీసుకోవాలి.

-వాణి సక్కుబాయి, ఉపాధ్యాయురాలు 
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.