చాలా మందికి నిద్రపోయే ముందు చేసే చివరి పని, నిద్రలేచిన తర్వాత చేసే మొదటి పని ఫోన్‌ను చూడటం. దిండు కింద ఉంచినా, మంచం పక్కన టేబుల్‌పై ఉంచినా, లేదా ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మంచం పక్కన పెట్టినా, మొబైల్ ఫోన్ రాత్రిపూట కూడా ఒక తోడుగా మారిపోయింది. అయితే.. రాత్రిపూట ఫోన్ వాడకం నిద్రను ప్రభావితం చేస్తుంది. అనారోగ్యకరమైన స్క్రీన్ అలవాట్లకు కారణం అవుతుంది.
ఫోన్‌ను వాడకపోయినప్పటికీ నోటిఫికేషన్లు, కాల్స్, వైబ్రేషన్లు నిద్రకు భంగం కలిగిస్తాయి. ఒక మెసేజ్ అలర్ట్ మిమ్మల్ని నిద్రలేపవచ్చు. పదేపదే నిద్రకు భంగం కలగడం వల్ల ఈ ప్రభావంతో పగటిపూట అలసటగా, చిరాకుగా లేదా ఏకాగ్రత లోపించినట్లుగా అనిపించవచ్చు. పడుకునే సమయంలో మీ ఫోన్‌ను అందుబాటులో ఉంచుకోవడం వల్ల, రాత్రిపూట నిద్రలేచినప్పుడల్లా మెసేజ్‌లను చూసుకునేలా మీ మైండ్ మారిపోతుంది. కాలక్రమేణా, ఈ అలవాటు నిద్రకు భంగం కలిగిస్తుంది.
నిద్రపోయే ముందు ‘డు నాట్ డిస్టర్బ్ మోడ్’ లేదా సైలెంట్ మోడ్‌ను ఆన్ చేయండి. ఫోన్‌ను చూడాలనే ఆలోచనను తగ్గించుకోవడానికి దానిని దిండుకు దూరంగా ఉంచండి. మొబైల్ ఫోన్లు రేడియోఫ్రీక్వెన్సీ (RF) శక్తిని విడుదల చేస్తాయి. మీ దిండు కింద ఫోన్‌ను ఛార్జ్ చేయడం ప్రమాదకరం కావచ్చు. మూసి ఉన్న ప్రదేశంలో ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు అది వేడెక్కే ప్రమాదం ఉంది.
ALSO READ : వేడివేడి టీ తాగకండి.. అలా అని చల్లబడిపోయాక తాగమని కాదు..
ఛార్జింగ్ అవుతున్న ఫోన్‌ను దిండు, దుప్పటి లేదా పరుపు కింద పెట్టడం వల్ల వేడి లోపలే చిక్కుకుపోయి, ఉష్ణ విసర్జనకు ఆటంకం కలుగుతుంది. పాడైన బ్యాటరీలు, లోపాలున్న ఛార్జర్లు, దెబ్బతిన్న కేబుల్స్ వల్ల ఫోన్ అతిగా వేడెక్కడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. నిద్రపోయే ముందు ఫోన్‌ను పొరపాటున కూడా మీ దగ్గరలో ఉంచుకోకండి. నిద్ర పోయే ముందు, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడటం అలవాటుగా మార్చుకోకండి.
