Good Relation:  భార్యభర్తలు ఇలా జీవించండి.. అస్సలు గొడవలే రావు.. జీవితాంతం కలిసే ఉంటారు

Good Relation:  భార్యభర్తలు ఇలా జీవించండి.. అస్సలు గొడవలే రావు.. జీవితాంతం కలిసే ఉంటారు

పెళ్లంటే జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా కలిసి నడవాలి. కానీ మారుతున్న పరిస్థితులు, పని ఒత్తిడి వల్ల చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు నేటితరం. పెళ్లి బంధంతో ఒక్కటయ్యాక కూడా' నా..నీ..' అనుకోవడం వల్ల ఈ గొడవలు మరీ ఎక్కువవుతున్నాయి. సాధారణంగా కొత్తగా పెళ్లైన ప్రతి జంటా ఒకటి రెండు సంవత్సరాలు కలిసి మెలిసి బాగానే ఉంటున్నారు. తర్వాతర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో ఇద్దరి మధ్య సఖ్యత కరువవుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ మనస్పర్థలు విడాకులకు కూడా దారితీస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలతో జీవితాంతం పశ్చాత్తాపడకుండా ఉండాలంటే మీ జీవిత భాగస్వామితో ఇలా మెలగాలి.


రిలేషన్ అర్థం చేసుకోవాలి: పొద్దున లేస్తూనే భార్యాభర్తలిద్దరూ పనులకు పరిగెత్తే కాలం ఇది. ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటేనే సమయానికి ఆఫీసుకి చేరుకోగలరు. అలాంటి సమయంలో ఇద్దరి మధ్య సర్దుకుపోయే గుణం లేకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి.
అభిప్రాయభేదాలను దూరం చేసుకొని ఒకే బాటలో నడవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకొని. మెలగాల్సిందే.

సర్దుకుపోతే చాలు: ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు అనుబంధానికి పనుల ఒత్తిడే కాదు.. సాంకేతికత కూడా పెద్ద అవరోధంగా మారుతోంది. దాంతో ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపే సమయమే తగ్గుతోం ది. అందుకే ఇంటి వద్ద ఫోన్, ల్యాప్​టాప్, టీవీ వాడకాన్ని తగ్గించుకోవడం మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు మెయిల్ చూసుకోవడం, ఫోను మాట్లాడటం లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. తప్పని సరి అయితే కొంత సమయం పెట్టుకుని ఆ తర్వాత భాగస్వామికి సమయం కేటాయించుకునేలా చూసుకోవాలి.

గతాన్ని తవ్వకండి: పొరపాట్లు సహజం, అవి ఇద్దరిలో ఎవరి వల్లయినా జరగొచ్చు. ప్రతీ సమస్యని మీవైపు నుంచే కాకుండా ఎదుటివారి కోణం నుంచి కూడా చూడండి. భాగస్వామిలో ఏదైనా లోపం, సమస్య ఉందని గుర్తించినప్పుడు... గొడవ జరిగినప్పుడు పదే పదే వాటిని ప్రస్తావించడం చాలామంది చేసే పొరపాటు. గతాన్ని పదేపదే తవ్వి లోపాలను ఎత్తి చూపడం వల్ల మనస్పర్ద లు మరింత పెరుగుతాయి. నిజానికి అవతలి వారిలో లోపాలు కనిపించినా వాటిని కొన్ని సార్లు ప్రస్తావించక పోవడం మంచిది. మితి మీరితే మాత్రం చెప్పాల్సిందే.

నేనేం తక్కువ: ఒకప్పటి కాలంలో ఎక్కువగా నిరక్షరాస్యు లైన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. క్రమంగా అవి విడిపోవడానికి దారితీసేవి. కానీ ప్రస్తుతం డిగ్రీలు, బీటెక్, పీహెచ్ డీ లు చేసి మంచి ఉద్యోగాలు చేసేవారు కూడా చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. క్షణికావేశంతో విహహ బంధాన్ని తెంచుకుంటున్నారు. కొందరైతే 'నేనేం తక్కువంటే నేనేం తక్కువ' అంటూ ఆధిపత్య ధోరణితో పంతాలకు పోతున్నారు. కానీ ఈ పద్దతి మంచిది కాదు. వివాహ బంధాన్ని నిలబె ట్టుకోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలి. ఒకరి కోసం మరొకరు ఆలోచించి నడుచుకుంటూ బంధాన్ని బలపరుచుకోవాలి.

–వెలుగు,లైఫ్​–