బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఇన్వెస్టర్లకు మరీ ముఖ్యంగా సామాన్యులకు ఆసక్తి కలిగించే వార్త ఒకటి ఇప్పుడు మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. 2025లో అద్భుతమైన లాభాలను అందించిన గోల్డ్ 2026 జనవరిలో MCXలో 10 గ్రాములకు రూ.లక్ష 80వేల 779 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే తులం బంగారం ధర రూ.లక్ష కంటే కిందకు పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అమిత్ గోయల్ సీక్రెట్ రివీల్:
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిని తాకి కిందికి దిగివస్తున్నాయని ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు PACE 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ చెప్పారు. ప్రస్తుతం భారత మార్కెట్లో బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి దాదాపు 15 శాతం మేర తగ్గాయి. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అంటున్నారు ఆయన. డీ-డాలరైజేషన్ ప్రక్రియలో వస్తున్న పెను మార్పుల వల్ల.. 2027 చివరి నాటికి భారతదేశంలో 10 గ్రాముల(తులం) బంగారం ధర ఏకంగా రూ.లక్ష కంటే తక్కువకు పడిపోవచ్చని, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3వేల డాలర్లకు చేరుకోవచ్చని అమిత్ గోయల్ సంచలన అంచనాలను బయటపెట్టారు.
ALSO READ : డిగ్రీ ఏదైనా ఏఐతో సాఫ్ట్వేర్ కోడింగ్ రాయొచ్చు..
రష్యా తీసుకున్న నిర్ణయమే కీలక మలుపు:
బంగారం ధరల పతనానికి ప్రధాన కారణం రష్యా మళ్లీ అమెరికన్ డాలర్ వైపు మొగ్గు చూపడమేనని బ్లూమ్‌బెర్గ్ నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో.. డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి పుతిన్ సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రష్యా తన అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను తిరిగి అమెరికన్ డాలర్లలోనే చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు డాలర్ ప్రభావాన్ని తగ్గించడానికి బ్రిక్స్ దేశాలు బంగారాన్ని నిల్వ చేస్తూ వచ్చాయి. కానీ కూటమిలో కీలక దేశమైన రష్యానే మళ్లీ డాలర్ వైపు రావడం బంగారం డిమాండ్‌ను భారీగా తగ్గించనుందని వెల్లడైంది.
కేంద్ర బ్యాంకుల అమ్మకాల ఒత్తిడి:
గత కొన్ని ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు.. ట్రంప్ సుంకాల భయంతో బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేశాయని సెబీ రిజిస్టర్డ్ మార్కెట్ నిపుణుడు అనుజ్ గుప్తా అన్నారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు ఆకాశానికి చేరాయి. అయితే రష్యా తాజా నిర్ణయంతో సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్మే అవకాశం ఉంది. ఇదే జరిగితే మార్కెట్లోకి గోల్డ్ సప్లై పెరిగి.. డిమాండ్ తగ్గితే ధరలు వేగంగా పడిపోతాయని ఆయన వివరించారు.
డీ-డాలరైజేషన్‌కు గట్టి దెబ్బ:
చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలు అమెరికన్ డాలర్‌పై ఆధారపడటం తగ్గించి.. బంగారాన్ని ఒక ప్రత్యామ్నాయ కరెన్సీగా మార్చాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. 2020-24 మధ్య ప్రపంచంలో అమ్ముడైన బంగారంలో 50 శాతం కంటే ఎక్కువ ఈ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులే కొన్నాయి. కానీ రష్యా ఇప్పుడు డాలర్ సెటిల్మెంట్ సిస్టమ్‌లోకి తిరిగి వస్తుందన్న వార్త ఈ డీ-డాలరైజేషన్ ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా మారింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల వడ్డీ రేట్ల తగ్గింపుపై సందేహాలు రావడం కూడా బంగారంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మెుత్తానికి బులియన్ మార్కెట్లో భారీ బేర్ మార్కెట్ స్టార్ట్ అయ్యిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
