వెలుగు స్పెషల్: సీఈసీ చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాంగ పరీక్షలో నిలుస్తుందా?

వెలుగు స్పెషల్: సీఈసీ చట్టంలోని సెక్షన్ 16  రాజ్యాంగ పరీక్షలో నిలుస్తుందా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల సంఘం చట్టంలోని కీలక సెక్షన్ 16పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  భారత  ప్రజాస్వామ్యానికి గుండెలాంటి ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈ చట్టం ఇప్పుడు రాజ్యాంగ పరీక్షను ఎదుర్కోబోతోంది.  2023లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్‌‌మెంట్‌‌ కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ ఆఫీస్ 2023’లోని సెక్షన్ 16 ప్రకారం - ప్రస్తుత లేదా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ),  ఎన్నికల కమిషనర్లు (ఈసీ) తమ విధి నిర్వహణలో లేదా విధి నిర్వహణలో  ఉన్నప్పుడు చేసిన ఏ పనికైనా, మాటకైనా వారిపై ఏ కోర్టులోనూ సివిల్ లేదా క్రిమినల్ కేసు వేయడానికి లేదా కొనసాగించడానికి వీల్లేదు. అంటే జీవితకాలం పూర్తి రక్షణ లభిస్తుంది.

సుప్రీంకోర్టులో పిటిషన్ ఏమిటి?

అసోసియేషన్ ఫర్  డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) అనే ఎన్జీవో  ఈ సెక్షన్‌‌ను సవాల్ చేస్తూ  పిటిషన్ వేసింది. అక్టోబర్ 13న సీజేపీ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.  తదుపరి విచారణ నవంబర్ 2కి వాయిదా పడింది.  దీనికిముందు లోక్ ప్రహరి అనే సంస్థ వేసిన ఇలాంటి పిటిషన్‌‌తో దీన్ని జత చేసింది.  ఏ.డి.ఆర్  తరఫున సీనియర్ న్యాయవాది  గోపాల్  శంకరనారాయణన్ వాదిస్తూ  ఈ సెక్షన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం),  ఆర్టికల్ 21 (జీవించే హక్కు)లను ఉల్లంఘిస్తోందని,  బేసిక్ స్ట్రక్చర్‌‌‌‌కి విరుద్ధమని వాదించారు.

ఎందుకు వివాదం?

మితిమీరిన రక్షణ. రాష్ట్రపతికి, గవర్నర్లకు కూడా రాజ్యాంగంలో పరిమిత రక్షణ మాత్రమే ఉంది, అది కూడా  గుడ్ ఫెయిత్‌‌తో  చేసిన పనులకే.  కానీ  సీఈసీ, ఈసీలకు  గుడ్  ఫెయిత్ అనే షరతు కూడా లేకుండా జీవితాంతం రక్షణ ఇవ్వడం ఏ రాజ్యాంగ పదవికీ  లేని విశేషాధికారం కల్పించడం వివాదాస్పదంగా మారింది.  ఒకవేళ కమిషనర్లు అవినీతికి పాల్పడినా, అధికార దుర్వినియోగం చేసినా కోర్టుకు వెళ్లే దారి మూసుకుపోతుంది. ఇంపీచ్‌‌మెంట్ తప్ప వేరే మార్గం లేదు, అది కూడా ప్రభుత్వ చేతిలోనే ఉంటుంది.  

ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన సమయంలో చర్చ లేకుండా ఈ సెక్షన్‌‌ను  చివరి నిమిషంలో చేర్చారని ఏడీఆర్ ఆరోపణ. ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం అంటే చట్టం రద్దు అయినట్లు కాదు.  కానీ రాజ్యాంగ పరీక్ష మొదలైందని అర్థం.  స్వతంత్ర సంస్థను కాపాడాలా, లేక అపరిమిత అధికారాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా అనే సమతుల్యతను  సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. 


 
- ఇరికి మహేష్ 
అడ్వకేట్