పోయెట్రీ కార్నర్: అయోమయం.. కన్నీటి తరంగాలు

పోయెట్రీ కార్నర్: అయోమయం.. కన్నీటి తరంగాలు

అంతా ఆమెమయం..!
ఆమె కలల కన్నీటి తరంగాలు 
వంటింటిని దాటి విజ్ఞాన విశ్వపు దారుల వెంట 
పాలపుంత పాదాల ఉపరితలంపై 
ప్రయోగాలు చేస్తున్నవి. 
అజ్ఞాన నాగరికత అంధకారాన్ని దాటుతూ 
ఆమె ఆలోచనల అడుగులు 
ఉన్నత చదువుల సంకల్పాల పరిమళాలతో 
ప్రపంచ ఉద్యోగ ఉద్యమాల 
నాయకత్వాన్ని నడిపిస్తున్నవి.
ఆమె చెమట చుక్కల అమృత ధారలు 
భవిష్యత్తు తరాల బతుకు జీవనదులై 
స్ఫూర్తి కిరణాల జీవన సంగీతాన్ని 
మాతృత్వమై సృష్టిస్తున్నవి..
ఆమె ఆత్మవిశ్వాస రాజకీయ కవనం 
స్వేచ్ఛగా ధైర్యపు రెక్కలు తొడుక్కొని 
నవ చరితను ప్రభవించే ప్రవాహమై 
కాల గమన గర్భంలో  
అజేయ విప్లవమై ప్రతిధ్వనిస్తున్నది.
ఆమె అక్షర అగ్నిపర్వతాలు పర్యావరణహితమై 
కాలుష్యపు గోడలను బద్దలు కొడుతుంటే..
ఇప్పుడామె ఆకుపచ్చని అడవి శ్వాస 
ప్లాస్టిక్ ను మాయం చేస్తున్న అవని భాష
ఇప్పటికీ అక్కడక్కడ మగాళ్ల 
మృగాల ‘దిశల’ దారి తప్పుతున్నది..
ఆమె స్వరాన్ని అణిచివేసే 
శతాబ్దాల శబ్దం వినిపిస్తున్నది
ఆశల అలలకు సంకెళ్లు 
నవ్వును గాయపరిచే చూపుల తూటాలు
మత సాంప్రదాయాల ముఖాన 
ఇంకా ఆరని నల్లటి మచ్చల క్రూరత్వం 
సంస్కృతి అద్దంలో 
కేవలం పిల్లల్ని కనమనే పగుళ్ల గుండె గుర్తులు 
నడక మారి సాంకేతికత 
నడిచే గమ్యం మారుతున్నా... 
ఇప్పటికీ ఆమె తలరాతలు 
లైంగిక వేధింపుల పాత కథలే..
ఏదేమైనా.. ఆమె నిశ్శబ్ద సమర సంకేతమై
అక్షర పోరాట యుద్ధగీతం నేర్చుకుంది. 
ఎదురీతల చైతన్య విప్లవ శంఖారావానికి
ఆమె ఆత్మగౌరవ ఎజెండాకు
జాతీయ జెండా సెల్యూట్ చేస్తోంది. 
వర్తమాన ల్యాప్​ట్యాప్ స్క్రీన్ 
వాల్ పేపర్స్ లో  మన ప్రగతి ముఖచిత్రం
సహనం, సమరం నేర్చుకున్న విభిన్న ధ్రువాల 
ఆధునిక జీవన అయస్కాంతం.. ఆమె!
కాలాన్ని నిర్వచిస్తూ నిర్దేశిస్తున్న 
పరమాణు గడియారం
విశ్వంతరాళంలో ఎక్కడైనా అనువర్తించే 
శక్తి నిత్యత్వ నియమం.. ఆమె!
ఆమె అన్నింటిలో సగం కాదు.. 
అనంతంలో సమస్తం..!  

- ఫిజిక్స్ అరుణ్ కుమార్ 
(శ్రీమతి చల్లా సరోజినీ దేవి స్మారక సాహిత్య పురస్కారం- 2026 పొందిన కవిత)