- రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు
- నెలాఖరు వరకు పనులు పూర్తిచేయాలని భెల్ కంపెనీకి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో గంటకు 2,500 టన్నుల బొగ్గును విద్యుతుత్పత్తికి పంపించేలా రాష్ట్ర జెన్ కో సంస్థ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేస్తున్నది. ఈ మేరకు అక్కడ పనులు చేపడుతున్న భెల్(బీహెచ్ఈఎల్) కంపెనీకి జెన్కో సీఎండీ డాక్టర్ హరీశ్ఆదేశాలు జారీ చేశారు.
అక్టోబర్ నెలాఖరు నాటికి పనులు కంప్లీట్ చేయాలని సూచించారు. ఈ పనులు పూర్తయితే రోజుకు సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల విలువ గల12 నుంచి 14 రేకుల బొగ్గును ప్లాంట్‌లో అన్లోడ్ చేసుకునే వీలవుతుంది. వైటీపీఎస్ ప్లాంట్‌లో ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీని పంపించింది.
ఆ అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారం విద్యుత్ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో పాటు జెన్ కో సీఎండీ హరీశ్ రోజూ ఉదయం, సాయంత్రం భెల్ కంపెనీతో పాటు ఇతర కాంట్రాక్ట్ ఏజేన్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సమీక్షిస్తున్నారు. ఆ అధికారుల సూచనల మేరకు హెడ్ క్వార్టర్స్, ఇతర పవర్ ప్లాంట్లలో పనిచేస్తున్న అదనపు ఇంజినీరింగ్ సిబ్బందిని కూడా వైటీపీఎస్‌కు బదిలీ చేశారు.
రోజుకు 1800 నుంచి 2300 మెగావాట్ల విద్యుతుత్పత్తి
జెన్ కో ఇంజినీర్లు ఇటీవల వైటీపీఎస్ 5వ యూనిట్‌ను సింక్రనైజేషన్ చేసి గ్రిడ్‌కు అనుసంధానించారు. తొలి బొగ్గు ఆధారిత ట్రయల్ సమయంలో 158.7 మెగావాట్ల గరిష్ఠ లోడ్‌ను సాధించి విజయవంతంగా పూర్తిచేసింది.
ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం, తదుపరి తుది సన్నాహక పనుల కోసం యూనిట్‌ను తాత్కాలికంగా హ్యాండ్-ట్రిప్ చేశారు. నవంబర్ లో ఈ యూనిట్ యొక్క వాణిజ్య కార్యకలాపాల తేదీని (సీఓడీ) ప్రకటించడానికి ఇంజినీర్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ప్లాంట్‌లో నాలుగు సూపర్ క్రిటికల్ యూనిట్లు విజయవంతంగా కమిషన్ అయి, రాష్ట్ర గ్రిడ్‌కు రోజువారీగా 1,800 మెగావాట్ల నుంచి 2,300 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తున్నాయి.
ఈ ఐదో యూనిట్ కూడా నవంబర్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, యాదాద్రి ప్లాంట్ తన గరిష్ట సామర్థ్యమైన 4,000 మెగావాట్లకు చేరుకుంటుంది అని జెన్కో సీఎండీ హరీశ్ ప్రకటించారు. ‘ప్రస్తుతం ప్లాంట్‌లోని బాయిలర్, టర్బైన్, నీటి వ్యవస్థలు, బూడిద నిర్వహణ వ్యవస్థలు అత్యంత సంతృప్తికరంగా పనిచేస్తున్నాయి.
ఎల్ నినో వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలో పెరుగుతున్న గృహ, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, జెన్ కో తన థర్మల్ యూనిట్ల ద్వారా రోజుకు కనీసం 140 మిలియన్ యూనిట్ల (ఎంయూ) బేస్-లోడ్ విద్యుత్‌ను అందించడానికి కట్టుబడి ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు.
