Toxic OTT Deal: అప్పుడు రూ.150 కోట్లు ఇస్తే వద్దన్నారు.. ఇప్పుడు రూ.30 కోట్లకే ? ‘టాక్సిక్’ ఓటీటీ డీల్‌లో భారీ ట్విస్ట్!

Toxic OTT Deal: అప్పుడు రూ.150 కోట్లు ఇస్తే వద్దన్నారు.. ఇప్పుడు రూ.30 కోట్లకే ? ‘టాక్సిక్’ ఓటీటీ డీల్‌లో భారీ ట్విస్ట్!

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో మాత్రం అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు వందల కోట్ల డీల్‌పై ఆశలు పెట్టుకున్న మేకర్స్‌కు ఇప్పుడు ఓటీటీ సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లు షాక్ ఇస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా రూ.150 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పడిపోయినట్లు చెబుతున్న డిజిటల్ హక్కుల విలువ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

రూ.150 కోట్ల ఆఫర్‌ను వదులుకోవడమే అసలు ట్విస్టా?

యశ్‌కు ‘కేజీఎఫ్’ సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆయన తదుపరి చిత్రమైన ‘టాక్సిక్’పై కూడా అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, సినిమా విడుదలకు ముందే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ హక్కుల కోసం సుమారు రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే, అంతటితో సరిపెట్టుకోకుండా రూ.200 కోట్లకు పైగా డీల్ వస్తుందనే అంచనాలతో ఆ ఆఫర్‌ను పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది.  థియేటర్లలో సినిమా భారీ విజయం సాధిస్తే, ఓటీటీ హక్కుల విలువ మరింత పెరుగుతుందనే అంచనాలు ఉండటం సహజమే. కానీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ, బాక్సాఫీస్ వసూళ్లు లభించకపోతే లెక్కలు తలకిందులవుతాయి. ‘టాక్సిక్’ విషయంలోనూ ఇదే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు రూ.30 కోట్లకే పరిమితమైన ఆఫర్!

‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల కోసం ప్రస్తుతం సుమారు రూ.30 కోట్ల ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని భాషల ఓటీటీ హక్కులకు సంబంధించి ఈ మొత్తం ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయంలో ZEE5 అత్యధిక ఆఫర్ ఇచ్చిన సంస్థగా వార్తలు వెలువడుతున్నాయి. ఇతర ప్రముఖ ఓటీటీ సంస్థలు మాత్రం గతంలో ప్రచారంలో ఉన్న భారీ మొత్తాలకు ముందుకు రావడం లేదని టాక్. అయితే, అన్ని ఓటీటీ సంస్థలు అధికారికంగా ఆఫర్లను తిరస్కరించాయని చెప్పడానికి క్లారిటీ లేకపోయినప్పటికీ, రూ.30 కోట్ల ఆఫర్ విషయంలోనూ చిత్రబృందం లేదా ZEE5 నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

రూ.30 కోట్ల డీల్‌లోనూ ఓ మెలిక?

ZEE5తో రూ.30 కోట్ల డీల్‌పై ప్రచారం జరుగుతున్నప్పటికీ, మొత్తం మొత్తాన్ని ముందుగానే చెల్లించే అవకాశం లేదని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. రూ.15 కోట్లు అడ్వాన్స్‌గా, మిగిలిన రూ.15 కోట్లు పే-పర్-వ్యూ ఆదాయంపై ఆధారపడి చెల్లించే అవకాశం ఉందని సమాచారం. అయితే, దీనిపై అధికారిక స్పష్టత లేదు.

ఓటీటీ కోసం కొత్త వెర్షన్ సిద్ధం చేస్తున్నారా?

ఈ సినిమా డిజిటల్ హక్కులపై మెరుగైన ధరను పొందేందుకు ఓటీటీ వెర్షన్‌ను కొత్తగా ఎడిట్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. కథనంలోని అడల్ట్ కంటెంట్, శాటిలైట్ హక్కుల ద్వారా ఆదాయం పొందే అవకాశాలపై ఉన్న పరిమితులు కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. అయితే, కొత్త వెర్షన్‌పై మేకర్స్ ఫైనల్ డెసిషన్ ఏంటన్నది క్లారిటీ లేదు.

►ALSO READ | Thulabharam: రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబోలో ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌లో అసలు ట్విస్ట్ ఇదే!

అసలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది?

ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ‘టాక్సిక్’ సెప్టెంబర్ 25న ZEE5లో స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరిగినా, ఆ తేదీకి అందుబాటులోకి రాలేదు. అక్టోబర్‌లోనూ కొత్త విడుదల తేదీపై స్పష్టత లేదు. మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే.

రూ.150 కోట్ల ఆఫర్ నుంచి రూ.30 కోట్ల ప్రతిపాదన వరకు సాగినట్లు ప్రచారం జరుగుతున్న ఓటీటీ హక్కుల వ్యవహారంలో చివరకు ఏ సంస్థ హక్కులు దక్కించుకుంటుంది? మేకర్స్ ప్రస్తుత ఆఫర్‌కు అంగీకరిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.