నందమూరి తారకరామారావు తనయుడిగా, నటసింహం నందమూరి బాలకృష్ణ సోదరుడిగా, టాలీవుడ్ యంగ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల తండ్రిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటుడు, దివంగత నేత నందమూరి హరికృష్ణ. ఈ రోజు ( సెప్టెంబర్ 2, 2026 ) ఆయన 70వ జయంతి. ఆయన మన మధ్య లేకపోయినా వెండితెరపై ఆయన కనిపించిన తీరు, నిత్యం గర్జించే ఆయన స్వభావం, ఎవరైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే ఆ నైజం అభిమానులకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి...
తండ్రి విజయానికి తోడుగా..
ముఖ్యంగా 'సీతారామరాజు' సినిమాలో ఆయన చూపించిన రౌద్రం, 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంలో పండించిన వినోదం, 'శ్రీరాములయ్య'లో చూపిన పవర్ ఫుల్ యాక్టింగ్ ఆయన ప్రత్యేకతను చాటాయి. నటనలోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకెళ్లారు. తన తండ్రి ఎన్టీఆర్ 'చైతన్య రథం' సారథిగా వేలాది కిలోమీటర్లు డ్రైవ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజ్యసభ సభ్యుడిగా, రవాణా శాఖ మంత్రిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు.
తారక్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్..
ఆయన దూరమై ఏళ్లు గడుస్తున్నా.. కొడుకులు తారక్, కళ్యాణ్ రామ్‌లలో అభిమానులు ఇప్పటికీ హరికృష్ణగారి రూపాని, ఆ గంభీరాన్ని చూసుకుంటున్నారు. తండ్రి జయంతిని పురస్కరించుకుని ఈ అన్నదమ్ములు ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భావోద్వేగ సందేశాలు ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రిని తలచుకుంటూ.. "మా వ్యక్తిత్వం నువ్వే, మా అస్తిత్వం నువ్వే.. ఎన్నటికీ సడలని ధైర్యంతో సాగే ఈ ప్రయాణానికి దిశానిర్దేశం నువ్వే.. తరతరాలుగా గుండెల్లో భద్రంగా దాచుకునే మా కంటిపాప కన్నీటి చుక్కవు నువ్వే" అంటూ కన్నీటి నివాళులర్పించారు.
మరోవైపు కళ్యాణ్ రామ్ తమ తండ్రి పాత జ్ఞాపకాలను, వింటేజ్ ఫోటోను షేర్ చేస్తూ.. "సంవత్సరాలు గడిచిపోవచ్చు.. కాలం ముందుకు సాగిపోవచ్చు.. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు.. నిత్యం మాలోనే జీవిస్తావు. హ్యాపీ బర్త్ డే నాన్నా" అని ఎమోషనల్ అయ్యారు.
రూపం మారినా, కాలం మారినా హరికృష్ణ గంభీర స్వరం, ఆ దమ్మున్న నాయకత్వం, ఆయన నేర్పిన ధైర్యం నందమూరి కుటుంబానికి, కోట్ల మంది అభిమానులకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. దివంగత హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులతో పాటు అభిమానులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
