ఇండస్ట్రీలోకి ఎన్నో కలలతో అడుగుపెట్టి, వాటిని ఒక్కొక్కటిగా నిజం చేసుకుంటున్న ఓ యువ దర్శకుడి జీవితంలో విధి ఊహించని విషాదాన్ని నింపింది. ఆరేళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో కొత్త అర్థం ఇచ్చారు. ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా తొలి వెబ్సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.. కానీ ఆ విజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలోనే ఆయన కన్నుమూశారు. కేరళకు చెందిన యువ దర్శకుడు బెల్రాజ్ కలరిక్కల్ (27) ఆకస్మిక మరణం మలయాళ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తొలి సిరీస్ విడుదల.. మరుసటి రోజే విషాదం!
బెల్రాజ్ దర్శకత్వం వహించిన 'కప్పి స్క్వాడ్' వెబ్సిరీస్ అక్టోబర్ 16న జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కు వచ్చింది. దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్న బెల్రాజ్ కలరిక్కల్ కు ఇది ఎంతో ప్రత్యేకమైన మైలురాయి. అయితే, ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. సిరీస్ విడుదలైన మరుసటి రోజే కొచ్చిలోని ఓ హోటల్ గదిలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. 27 ఏళ్ల వయసులోనే ఆయన జీవితం ముగియడం అందరినీ కలచివేస్తోంది.
ఆరేళ్ల ప్రేమ.. నెల రోజుల క్రితమే పెళ్లి!
బెల్రాజ్ వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు ఆరేళ్లుగా ప్రేమించిన యువతిని గత సెప్టెంబర్లో వివాహం చేసుకున్నారు. కెరీర్లో తొలి అడుగు విజయవంతంగా పడిన వేళ.. జీవిత భాగస్వామితో కలిసి ఎన్నో భవిష్యత్తు కలలు కని ఉంటారు. కానీ ఆ కలలన్నీ నెరవేరకముందే ఆయన దూరమవడం హృదయాలను పిండేస్తోంది. కొత్తగా మొదలైన వైవాహిక జీవితంలో ఈ విషాదం ఆయన కుటుంబానికి, భార్యకు తీరని లోటుగా మిగిలిపోయింది.
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా..
'నిళల్', 'మధురం', 'డాకిని' వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన బెల్రాజ్.. 'కప్పి స్క్వాడ్'తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. రినోష్ జార్జ్, అనఘ అజిత్ తదితరులు నటించిన ఈ సిరీస్ నలుగురు యువకుల స్టార్టప్ కలల చుట్టూ తిరుగుతుంది. ఎన్నో ఆశలతో మొదలైన ఆయన సినీ ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగియడం విషాదకరం. బెల్రాజ్ మృతి పట్ల సినీ అభిమానులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
